హైదరాబాద్, నవంబర్ 3,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మూడు రాజధానులు అంశం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర – 2 కు పలు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జససేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన విశాఖ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. విశాఖలో చెలరేగిన ఘర్షణలు ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకున్నాయి. పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాదు లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ ఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడుతున్నారన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.అనుసరిస్తున్న వారు అభిమానులు కాదు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది కూడా వారి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయి. బుధవారం కారులోనూ, మంగళవారం ద్విచక్రవాహనాలపై అనుసరించారు. సోమవారం అర్దరాత్రి కూడా ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆయినా సిబ్బంది సంయమనం పాటించారు. ఈ సంఘటనను వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం.పవన్ కల్యాణ్ చేపట్టిన విశాఖ టూర్ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎయిర్ పోర్ట్ ఘటన కేసులో ఇద్దరు జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్ట్ లో మంత్రులు రోజా, జోగి రమేష్ లతో పాటు వైవీ సుబ్బా రెడ్డిల వాహనాలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులు, కార్యకర్తలపై హత్యాయత్నం తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కళావాణి స్టేడియంలో జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది.