విజయవాడ, నవంబర్ 4,
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశం తగ్గిపోతుండడంతో అనేక సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కంపెనీలు గుజరాత్ కి తరలిపోతున్నాయి. గతంలో కర్నూలు, కడప, అనంతపరం జిల్లాల్లో స్థాపించిన సంస్థలు అభివృద్ధిపరంగా ఎలాంటి నమ్మకం కలగక పోవడంతో వాటి కార్యకలాపాలక స్వస్తి పలికి పెట్టు బడులకు ఎంతో అనుకూలమయిన, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్ర మయిన గుజరాత్ కు తరలి పోతున్నాయి.అనంతపురం జిల్లా నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల విండ్ మిల్ యూనిట్లు ఇప్పటికే తరలిపోయా యి. అవి ఉత్పత్తి చేస్తున్న గ్రీన్ విద్యుత్ కు తగినంత ధర పొందలేకపోవడమే అందుక ప్రధాన కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం అనేక ప్రయివేటు కంపెనీలు సోలార్, విండ్ పవర్ యూనిట్లను ప్రారంభించాయి. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి యూనిట్ నాలుగు రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం టారిఫ్ ను మార్చి యూనిట్ కు కేవలం రెండు రూపాయలే యిస్తున్నది. ఇలానే, కళ్యాణదుర్గ, రామగిరి, రెడ్డం ప్రాంతాల్లో అనేక పెద్ద సంస్థలు నెలకొల్పిన యూనిట్లు మెల్లగా ఎక్కడో ఉన్న గుజరాత్ లో తమ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాయి. సుమారు వెయ్యి మెగావాట్ల యూని ట్లు ముఖ్యంగా అనంతపురం జిల్లాల్లో నెలకొల్పవలసినవి దూరంగా ఉన్న గుజరాత్ మేలని తరలి పోయాయని అంటున్నారు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో కొండప్రాంతాలతో ఉన్నందువల్ల విండ్ విద్యుత్ కి ఎంతో అనుకూలం. ముఖ్యంగా ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య గాలి వేగం గంటకు 45 కి.మీ ఉంటుంది. ఇది విద్యుదుత్పత్తికి ఎంతో అనుకూలమని రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి కార్పోరేషన్ (నెడ్ కాప్) పేర్కొన్నది. ముఖ్యంగా ఉరవకొండ, సి.కె.పల్లి, వజ్రకరూర్, రామగిరి , రొడ్డం ప్రాంతాలు ఎంతో అనుకూలమని నెడ్ కాప్ అధికారులు పేర్కొన్నారు. పైగా వారి యూనిట్లు పెట్టుకోవడానికి కనీసం ఒక్క ఎకరం ప్రభుత్వ భూమి కూడా తమకు లేదని, కొండ ప్రాంతాలన్నీ ప్రయివేటు కంపెనీలకు లీజుకు ఇచ్చేశారని వారితో రైతులు కూడా ఒప్పందాలు కుదుర్చకున్నారని అధికారులు చెప్పారు. అయితే పవర్ టారిష్ తమకు ఉపయోగకరంగా లేదు గనుక ఈ ప్రయివేటు కంపెనీలు వాటి కొత్త యూనిట్ల ఏర్పాటు విషయలో పెద్దగా ఆసక్తీ చూపడం లేదు.