YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనాని తడబాటు...

జనసేనాని  తడబాటు...

ఏలూరు, నవంబర్ 4, 
చేగువేరా, భగత్‌సింగ్, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డితోపాటు మరెంతో మంది కమ్యూనిస్టు నాయకుల అడుగుజాడలలో నడుచుకుంటూ నా జీవితం పేద ప్రజలకు అంకితం చేస్తా. దేశానికి, రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపనే నన్ను రాజకీయాల వైపు మళ్లించింది' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతూ ఉండేవారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా తన మార్కు చూపించారు. ప్రతిపక్షాల మీద ఘాటు పదజాలంతో విమర్శలు చేశారు. అతి తక్కువ సమయంలో యువతకు చేరువయ్యారు. తదనంతర పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. ఇది నచ్చని పవన్ కొంతకాలం అన్నకు దూరంగా ఉన్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ విభజనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ప్రకటించారు. విడిపోయిన తర్వాత పది రోజుల పాటు అన్నం తినలేదని పదే పదే ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలనుకుని టీడీపీ, బీజేపీ తరఫున ప్రచారం చేసి ప్రధాని మోడీతోనే నేరుగా సత్సంబంధాలను ఏర్పరచుకునే స్థాయికి చేరుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి పవన్ ప్రచారం కూడా బాగా కలిసి వచ్చిందని అందరూ భావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి బహిరంగ సభలో ప్రధాని హామీ ఇచ్చారు. ఆ తరువాత 'సాధ్యం కాదు, ప్యాకేజీ మాత్రమే ఇస్తామని' మాట తప్పడంతో ఆ పార్టీని ప్రశ్నిస్తూ వచ్చారు. 'పాచిపోయిన లడ్డూలు ఇస్తే కుదరదని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని' గట్టిగా డిమాండ్ చేశారు.రెండోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని భావించి జనసేన పార్టీని స్థాపించారు. తన పార్టీ కులమతాలకతీతంగా పేద ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటుందని, నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. సీపీఐ, సీపీఎంతో సాన్నిత్యం కొనసాగించి బీజేపీ, టీడీపీపై ఉద్యమాలు నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో బీజేపీ, సాధించడంలో టీడీపీ ఘోరంగా విఫలమయ్యాయని, తాను ప్రత్యేక హోదా సాధిస్తానని చెబుతూ వచ్చారు. జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేశాయి. పవన్ కళ్యాణ్‌కు యువత, మహిళలలో ఉన్న ఫాలోయింగ్ చూసి కాకలు తీరిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరి పోటీ చేశారు. అందులో జేడీ లక్ష్మీనారాయణ, నాదెండ్ల మనోహర్ తదితరులు ఉన్నారు.నాదెండ్ల మనోహర్‌కు పార్టీలో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ కూటమితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను మార్పులు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా ఫలితాలు చూస్తే పవన్ రెండు చోట్ల పోటీ చేసినా ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. జనసేన నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత పవన్ నిలకడ లేని ఆలోచనలు చేసుకుంటూ వచ్చారు. సినిమాలలో నటించడం ప్రారంభించారు. పార్టీని నడిపించాలంటే డబ్బు ఉండాలి కదా? డబ్బు ఉండాలంటే సినిమాలు తప్పకుండా తీయాలని చెప్పడం మొదలెట్టారు. ఈ క్రమంలో నాదెండ్ల మనోహర్‌తో ఉన్న సాన్నిహిత్యం పవన్‌ను బీజేపీ వైపు వెళ్లేలా చేసింది. పథకం ప్రకారం మనోహర్ ఇదంతా చేశారనే ప్రచారం ఉంది. దీంతో జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారుఇదంతా జనసేనానికి తెలిసే జరుగుతుందా? లేక తెలిసినా తెలియనట్టు ఉంటున్నారా? అనేది అర్థం కావడం లేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించేందుకు, తాను అండగా ఉంటానని పవన్ రాజధాని ప్రాంతాలలో పర్యటించి రైతులకు మనోధైర్యం కల్పించారు. పవన్‌కు టాలీవుడ్‌లో ఏ హీరోకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కొద్ది రోజులుగా టీడీపీ కంటే ఎక్కువగా పవన్ ఆయన అనుచరులు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో జరిగిన ర్యాలీ నేపథ్యంలో జనసైనికులు మంత్రుల కార్ల మీద దాడులు చేయడంతో మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నడూ లేని విధంగా పవన్ పరుష పదజాలంతో వైసీపీ మంత్రుల మీద విరుచుకుపడ్డారు. మంత్రులు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పవన్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ 'ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు' అంటూ కౌంటర్ ఇచ్చి రాజకీయ దుమారం రేపుతున్నారు.ఈ వ్యాఖ్యలు పవన్ రాజకీయ భవిష్యత్‌పై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలను బీజేపీ తన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటోందని అంటున్నారు. పవన్ తెలంగాణలో సైతం పోటీ చేస్తాననడం, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడడం మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి సంకేతమని చెప్పక తప్పదు. ఇప్పుడు పవన్ బీజేపీతో ఉంటారా? వామపక్షాలతో పాత బంధాలను పునరుద్ధరించుకుంటారా? వేచి చూడాలి.

Related Posts