YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ లో అంత ఈజీ కాదా

గుజరాత్ లో అంత ఈజీ కాదా

గాంధీనగర్, నవంబర్ 4, 
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గుజరాత్ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దాదాపు 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. డిసెంబర్ 1,డిసెంబర్ 5న రెండు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2012, 2017లోనూ ఇదే విధంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. 1995 ముందు వరకూ గుజరాత్..కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. ఎప్పుడైతే 1995 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వచ్చిందో.. అప్పటి నుంచి వరుసగా విజయ దుందుభి మోగిస్తూ వస్తోంది. సీట్ల సంఖ్య తగ్గుతున్నప్పటికీ...భాజపానే విజయం సాధించింది. అధికారం సొంతమైనప్పటికీ...భాజపాను సీట్లు తగ్గిపోవటం కలవర పెడుతోంది. 1995 నుంచి చూస్తే...అత్యంత తక్కువగా 2017 ఎన్నికల్లో 99 స్థానాలకే పరిమితమైంది కాషాయ పార్టీ. అంతకు మించి భాజపాను కలవరపెడుతున్న విషయం...కాంగ్రెస్‌కు కూడా రాష్ట్రంలో ఓటు బ్యాంకు ఉండటం. 2017 ఎన్నికల్లో బీజేపీ దాదాపు 50% ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌కు 41.44% ఓట్లు దక్కాయి. అంటే...ఒకటి రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పుంజుకుంటే...భాజపాకు గట్టి పోటీ ఇవ్వటం ఖాయం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...భాజపా ఓటు బ్యాంకులో 3% మేర కోత పడింది. కాంగ్రెస్‌తో నేరుగా పోటీ ఉంటుందనుకున్నా..ఈ సారి సీన్‌లోకి ఆప్ కూడా వచ్చింది. ఫలితంగా...త్రిముఖ పోరు తప్పేలా లేదు. అంతే కాదు. భాజపా ఓటు బ్యాంకు చీలిపోవటమూ ఖాయం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కన్నా భాజపాకు తక్కువ ఓట్లు పోల్ అవుతాయన్న అంచనాలూ ఉన్నాయి. 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు నరేంద్రమోదీ కారణంగా భాజపాకు గుజరాత్‌లో ప్రజాదరణ లభించింది. 2017 ఎన్నికలు జరిగే నాటికి ఆయన ప్రధాని హోదాలో ఉన్నారు. అయినా..గుజరాతీ ఐడెంటిటీతో...భాజపా విజయంసాధించింది. కానీ..ఈ సారి విజయం అంత సులభంగా దక్కే అవకాశాలు కనిపించటం లేదన్నది కొందరి విశ్లేషణ. ఆప్ రాకతో ఓట్లు చీలిపోయి...అటు కాంగ్రెస్‌,ఇటు భాజపాకు నష్టం జరిగే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అయితే..ఈ నష్టం ఎంత మేర ఉంటుందనేది ఫలితాలు వెలువడ్డాకే స్పష్టత వస్తుంది. 2012 ఎన్నికలతో పోల్చితే...2017లో అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు సీట్లు తగ్గిపోయాయి. 2012లో నరేంద్రమోదీముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ 115 సీట్లు సాధించింది. 47.85% ఓట్లు రాబట్టుకోగలిగింది. కాంగ్రెస్ 61 సీట్లతో 38.93% ఓటు షేర్ సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాటిదార్ ఉద్యమంతో కాంగ్రెస్ కొంత వరకూ లాభ పడింది. అయితే...ఆ పాటిదార్ ఉద్యమానికి నేతృత్వం వహించిన హార్దిక్ పటేల్ భాజపాలో చేరారు. ఫలితంగా..ఈ సారి కాంగ్రెస్‌కు పెద్దగా కలిసొచ్చే అంశాలేమీ కనిపించటం లేదు. ఇది కొంత వరకూ భాజపాకు లబ్ధి చేకూర్చుతుంది. అయితే...ద్రవ్యోల్బణం, నీటి కొరత లాంటి సమస్యలు కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. భాజపా మాత్రం వీటిని కొట్టి పారేస్తూ...కేవలం ప్రధాని మోదీ చరిష్మానే నమ్ముకుంటూ ప్రచారం చేసుకుంటోంది. అయితే...అటు ఆప్ కూడా ప్రచారంలో జోరు పెంచటం వల్ల కొంత మేర భాజపా ఓటు బ్యాంకుకి గండి పడే అవకాశాలున్నాయి. ఆ విధంగా...ఆప్..భాజపాకు గట్టి పోటీ ఇవ్వనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts