హైదరాబాద్, నవంబర్ 5,
ఇటీవల పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బక్కని నరసింహులను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించిన కాసాని జ్ఞానేశ్వర్.. ఇటీవలి కాలంలో సైలెంట్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్ లేదా బీజేపీలోకి చేరుతారని అనుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లి ఈటల, హరీష్ రావు చర్చలు జరిపారు. అయితే కాసాని మాత్రం అనూహ్యంగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పది రోజుల కిందట ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆయనకు పగ్గాలు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికంగా బలవంతుడైన కాసాని జ్ఞానేశ్వర్.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని మెరుగు పరుస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు.ఎల్.రమణ టీ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత.. పూర్తిగా టీ టీడీపీ కార్యక్రమాలు ఆగిపోయాయి. బక్కని నరసింహులును నియమించినా... క్యాడర్‌ను కదిలించలేకపోయారు. కాసాని జ్ఞానేశ్వర్ పలువురు బీసీ నేతలను మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం... తెలంగాణ బీసీ వర్గాల్లో టీడీపీకి ఇప్పటికీ మంచి ఆదరణ ఉందని .. దాన్ని ఓట్లుగా మలుచుకోగల నేతలు ఉంటే సీట్లు సాధించమని టీడీపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. 2014లో 15 అసెంబ్లీ సీట్లు గెలిచిన టీడీపీ.. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా రెండు సీట్లు మాత్రమే గెలిచింది. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్. తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గం బలంగా ఉంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాసాని. గతంలో ఆయన ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. కాసాని చేరికతో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందన్నారు చంద్రబాబు. త్వరలోనే తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. తెలంగాణలో టీడీపీకి నేతలు దూరమైనా కేడ్ బలంగానే ఉందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గ్రేటర్‌తో పాటు ఖమ్మం వంటి చోట్ల మంచి ఫలితాలు వచ్చేందుకు కాస్త కష్టపడే.. మంచి నాయకులు ఉంటే చాలన్న వాదన వినిపిస్తూండటంతో... కాసానికి కొత్త బాధ్యతలు ఇవ్వడం.. చర్చనీయాంశమవుతోంది. టీడీపీని వీడి ఇతర పార్టీల్లో చేరిన కొంత మంది నేతలు తిరిగి టీడీపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొన్ని బలం ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి.. పని చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.