హైదరాబాద్, నవంబర్ 7,
మునుగోడు బై ఎలక్షన్ గెలుపుతో మంచి ఊపు మీదున్న కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టునున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ పై కసరత్తు చేయనున్నారు. బీఆర్ఎస్‌కు జాతీయ ఎజెండా ఫైనల్ చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టునున్నట్టు తెలిసింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా ప్రకటించిన తర్వాత జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ పెట్టుకున్న దరఖాస్తు ఈసీ వద్ద పెండింగ్‌లో ఉన్నది. వెంటనే పార్టీని గుర్తించి, దేశ వ్యాప్తంగా ఒకే గుర్తుపై పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని నేరుగా ఈసీని కలిసేందుకు ప్లాన్ చేస్తున్నారు.త్వరలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీపై పోరాటం చేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సహకారం కోరనున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ కోసం కలిసి వచ్చే పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. రిటైర్డ్ ప్రొఫెసర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లతో భేటీ కానున్నారు. మరోవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునేందుకు అక్కడి ప్రతిపక్షాలకు సహకరించాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అధికంగా ఉన్న చోట్లు పోటీకి దించేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని, ఇక నుంచి బీజేపీతోనే ఫైటింగ్ ఉంటుందని సంకేతాలను బలంగా పంపేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. సమయం, సందర్భం వచ్చిన ప్రతిసారీ బీజేపీ విధానాలపై అటాక్‌ను కొనసాగించాలని కేసీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కునేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఫామ్ హౌజ్ వీడియోలను అస్త్రంగా చేసుకోనున్నారు. ఈ వీడియోల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు ఎలా ప్లాన్ చేస్తున్నదో వివరించనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.