విశాఖపట్నం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ రాక సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ అప్పటి సీఐ ఉమాకాంత్, ఏసీపీ టేకు మోహన్ వుపై సస్పెన్షన్ వేటు విధిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. గత నెల 15న అధికార వైసీపీ పార్టీ గర్జన సభ నిర్వహించడం, అదే సమయంలో జనవాణి పేరిట కార్యక్రమం నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ విశాఖ రావడం జరిగాయి. అయితే రాష్ట్ర మంత్రులు విశాఖ నుంచి తిరుగు ప్రయాణానికి ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడం, అదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి భారీగా జనసేన పార్టీ అభిమానులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి రోజాపై హత్యాయత్నం జరిగిందంటూ పోలీసులు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. రోజా పీఏకు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన సమయంలో ఎయిర్ పోర్ట్ సీఐ ఉమాకాంత్ (2004వ బ్యాచ్), ఇన్చార్జి ఏసీపీ టేకు మోహన్ రావు (1989వ బ్యాచ్) నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇద్దర్నీ సస్పెండ్ చేశారు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన అధికారులు ఎయిర్ పోర్ట్ లోపలే కూర్చుండిపోయారని, మంత్రుల్ని లోనకు పంపించడంలో అప్రమత్తంగా లేరని పోలీస్ శాఖకు నివేదించినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆరోజు జరిగిన సంఘటనల నేపథ్యంలో విశాఖ పోలీసులు ఫెయిలయ్యారంటూ సాక్ష్యాత్తూ మంత్రి బొత్స కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఐ, ఏసీపీలపై సస్పెన్షన్ విధిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.