విశాఖపట్టణం, నవంబర్ 8,
ఈ నెల 11న ఏపీ లో ప్రధాని మోదీపర్యటించనున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ అప్రమత్తమైంది. మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ప్రధాని మోదీ విశాఖకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు ఇప్పటి నుంచే మోదీ పర్యటన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తో పాటు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తో పాటు సీనియర్ నేతలంతా విశాఖలోనే ఉన్నారు. విశాఖకు రైల్వే జోన్ కోరుతున్న వేళ ప్రధాని మోదీ పర్యటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఇదిలా ఉంటే బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్.. మోదీ పర్యటనలో పాల్గొంటారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీకి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. అప్పటి నుంచి వీరి స్నేహబంధం కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో జనసేన కు, బీజేపీ మధ్య దూరం పెరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ నేతల వైఖరిపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దాంతో బీజేపీ అగ్రనేతలు అలెర్ట్ అయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడారు. పవన్‌తో సఖ్యత ఉండాలని సూచించారు. అయినా సరే బీజేపీ నేతలు.. పవన్ కల్యాణ్ కలిసిన దాఖలు కనిపించలేదు.. మేము కలిసే ఉన్నామనే హింట్ కూడా ఇవ్వలేదు. అంతేకాదు పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు విడివిడిగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతలు లేకుండా పవన్ కల్యాణ్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అటు బీజేపీ నేతలు సైతం జనసేనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దీంతో ప్రధాని మోదీ పర్యటనకు పవన్ కల్యాణ్ వెళ్తారా..?. లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో వారంలోనే ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటివరకూ అసలు జనసేన నేతలకు కానీ.. పవన్ కల్యాణ్‌కు గాని ఎలాంటి ఆహ్వానాలు అందలేనట్లుగా తెలుస్తోంది. పవన్ మోదీ పర్యటనకు హాజరవుతారా అనే ప్రశ్నలకు అటు బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. పవన్‌ను ఆహ్వానించారా అనే ప్రశ్నలకు నిశ్శబ్ధం పాటిస్తున్నారు. ఇప్పుడు ఇవే పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా..? ఉండదా అనే ఉత్కంఠ ఆ రెండు పార్టీల దిగువ స్థాయి శ్రేణుల్లో నెలకొంది. మరి పవన్ కానీ, బీజేపీ నేతలు కానీ స్పష్టత ఇస్తారేమో చూడాలి.