విజయవాడ, నవంబర్ 8,
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరూ ఊహించలేరు. రాజకీయాలను మారుద్దామంటూ వచ్చిన వాళ్లను కూడా ఈ రాజకీయం మార్చేస్తుంది. రాజకీయం భ్రష్టుపట్టిపోయిందని.. ప్రశ్నించేందుకు రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పేందుకు తానొస్తున్నానంటూ సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలను మార్చేస్తానని వచ్చిన పవన్ కల్యాణ్ చివరకు ఆయన కూడా మారిపోయారు. కాదు కాదు రాజకీయమే పవన్ కల్యాణ్‌ను మార్చేసింది. ఇతర పార్టీల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. సహనం కోల్పోతున్నారు. చెప్పులు చూపించి మరీ వార్నింగ్ ఇస్తు్న్నారు. అంతేకాదు ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటన కూడా విమర్శలకు తావిస్తోంది. ఈ అంశాలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఎంతో ఓర్పు అవసరం అది తెలిసి కూడా పవన్ కల్యాణ్ సహనం కోల్పోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం పవన్ కల్యాణ్ అధికార వైసీపీ ట్రాప్‌లో పడ్డారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం, హెచ్చరికలు, చెప్పు చూపించడాలు, బూతు వ్యాఖ్యల సారాంశం వైసీపీ ట్రాప్‌లో ఇరుక్కున్నారనడానికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలను మారుస్తా.. ప్రజల పక్షాన నిలబడతా అంటూ రాజకీయ ఆరంగేట్రం చేశారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రశాంతంగా రాజకీయాలు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ.. ఇతర ప్రెస్‌మీటలలో అప్పుడప్పుడు ఆవేశంగా మాట్లాడినప్పటికీ ఘాటైన విమర్శలు చేయడం చాలా అరుదు. అయితే ఇటీవల కొంతకాలంగా పవన్ కల్యాణ్ తన రాజకీయ శైలిని మార్చేశారు. ఆవేశంతో కూడిన రాజకీయం చేయడం మెుదలు పెట్టారు. ఇందుకు నిదర్శనమే విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు. మూడు రోజుల విశాఖ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు. పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ ఒక్కసారిగా చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు. అక్కడితో ఆగిపోలేదు నా కొడకల్లారా అంటూ బూతుపురాణం లంకించుకున్నారు. అప్పటి వరకు పవన్ కల్యాణ్ వైసీపీ మంత్రులను బూతు మంత్రులు అంటూ ఘాటుగా విమర్శించేవారు. జనసేన పార్టీ ప్రశ్నలు వేస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా బూతుల మంత్రులు మైకుల ముందు వచ్చి ఊదరగొడుతున్నాయి అంటూ తీవ్ర విమర్శలు చేసేవారు. అలాంటి పవన్ కల్యాణ్ ఒక్కసారిగా చెప్పు చూపిస్తూ... బూతులు తిట్టడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చివేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ గ్రామంలో పర్యటించేందుకు వెళ్లారు. అయితే పార్టీ కార్యాలయం గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడంతో నడుచుకుంటూ వెళ్లారు. కొంత దూరం వెళ్లాక పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ కారుపై కూర్చుని వెళ్లారు. ఇప్పుడు ఇదే విమర్శలకు దారి తీస్తుంది. ఒక పార్టీ అధినేత అలా ప్రధాన రహదారిపై కారుపైన కూర్చుంటూ వెళ్లడంపై రాజకీయంగా విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో ఆవేశపూరితంగా చేసిన వ్యాఖ్యలు సైతం విమర్శలకు తావిస్తున్నాయి. అంతేకాదు పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించి మంత్రులు సైతం కౌంటర్ ఇచ్చారు. ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని చెప్పుకొచ్చారు. ప్రహారీ గోడలుమాత్రమే కూల్చివేసినట్లు అందుకు తగిన ఆధారాలను సైతం మీడియాకు విడుదల చేశారు. అంతేకాదు పవన్ కల్యాణ్ పర్యటన... వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెచ్చగొట్టే ధోరణి ఉండకూడదని పవన్ కల్యాణ్ మాత్రం దానినే అనుసరిస్తున్నారని మండిపడ్డారు. యువతను రెచ్చగొడుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.ఇకపోతే చెప్పు చూపించడం, బూతులు తిట్టడం, ఇప్పటం గ్రామంలో ఆవేశపూరితంగా పవన్ ప్రసంగించడాన్ని ఆ పార్టీ సమర్థించుకుంటుంది. వైసీపీ నేతలు ఆ పరిస్థితిని తీసుకువచ్చారని చెప్తోంది. ప్యాకేజీ ఎక్కడ తీసుకున్నారో చూపించలేరు కానీ ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు చూపించక ఏం చూపిస్తారంటూ రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారు. ఇదే తరుణంలో బూతుల మంత్రుల కంటే పవన్ కల్యాణ్ ఎక్కువ మాట్లాడలేదని.. విశాఖ పర్యటనలో వైసీపీ నేతలు,. అధికారయంత్రాంగంతో కలిసి సృష్టించిన విధ్వంసం తట్టుకోలేక బ్లాస్ట్ అయ్యారంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా బూతులు, విమర్శలు, కుళ్లు రాజకీయాలు చేస్తున్న వైసీపీకి ఇలాగే వ్యవహరించాలంటూ చెప్పుకొస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ వ్యవహార శైలిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తారా? లేక గతంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యల మాదిరిగానే తిరస్కరిస్తారా అనేది వేచి చూడాలి.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్, ట్రాప్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని టీడీపీ పదేపదే చెప్తూ వస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలపై ప్రజల్లో చర్చకు రాకుండా ఉండేందుకు వేరొక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి దాన్ని డైవర్షన్ చేస్తున్నారని టీడీపీ ఇతర పార్టీలు ఆరోపిస్తు్న్నాయి. తాజాగా ట్రాప్ పాలిటిక్స్ కూడా శ్రీకారం చుట్టిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ ట్రాప్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చిక్కుకున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుంటే పవన్ కల్యాణ్ మరింత రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని అవి పార్టీకి చేటు తెచ్చేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.