తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడిగా బలవంతపు పదవీ విరమణకు గురైన రమణ దీక్షితులకు ప్రముఖ న్యాయ కోవిదుడు, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మద్దతు పలికారు. ప్రధానార్చకుడి పదవి నంచి రమణ దీక్షితులను తొలగించేందుకు టీడీడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిన తీరును చూసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు స్వామి తెలిపారు. రమణ దీక్షితులు తొలగింపును కొట్టివేయాలని, టీటీడీలో నిధుల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణను కోరనున్నట్టు స్వామి చెప్పారు. శ్రీవారి ఆలయ నిర్వహణ, స్వామి వారి కైంకర్యాల విషయంలో అధికారులు, ప్రభుత్వ జోక్యాన్ని రమణ దీక్షితులు తప్పు బట్టిన విషయం తెలిసిందే. కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయన ఆరోపణలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఖండించిన విషయం తెలిసిందే.కాగా టీటీడీని కుదిపేస్తోన్న వివాదాలపై పాలక మండలి అధికారులతో మంగళవారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. టీటీడీ వ్యవహారాలపై చర్చించిన అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటివరకు జరిగిన పనులతో పాటు పలు విషయాలపై సీఎంకు వివరించామని అన్నారు.టీటీడీ విషయంలో కొన్ని కొత్త అంశాలు బయటకు వచ్చాయని వ్యాఖ్యానించారు. అన్ని అంశాలపై తాము చట్టపరంగానే ముందుకు వెళతామని చెప్పారు. దేవాలయ పవిత్రతకు భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారని ఆయన అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ముందుకు వెళ్లాలని అన్నారని తెలిపారు. టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పారు.
టీటీడీలోని కొన్ని నగలు మాయమయ్యాయంటూ వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని, 1952 నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఏయే నగలు ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ ఉన్నాయని, రికార్డులో అన్ని వివరాలు ఉన్నాయని ఈవో అన్నారు. 1952 నుంచి రికార్డులన్నీ పరిశీలించామని, నగలన్నీ సురక్షితంగా ఉన్నాయని చెప్పారు.