రాజమండ్రి, నవంబర్ 8,
లాభాల పంటగా కీర్తి గడించిన ఆయిల్ పామ్ సాగు నష్టాల బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్‌పై దిగుమతి సుంకం రద్దు చేయడంతో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దేశీయ మార్కెట్లో ధరలు పడిపోవడమే ఈ దుస్థితికి కారణమని రైతులు చెబుతున్నారు. వంట నూనెలు ఉత్పత్తి చేసే సంస్థలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మేలో ఆయిల్‌పామ్ గెలలు టన్నుకు గరిష్టంగా రూ.23,365 ధర ఉండగా, తాజాగా రూ.13,000కు పడిపోయింది. ఇదే ధర కొనసాగితే ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు నష్టపోతామని సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని 19 మండలాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు. 40,826 ఎకరాల్లో సాగవుతోంది. ఈ ఏడాది మరో ఐదు వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 4,175 ఎకరాల్లో మొక్కలు నాటడం ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు తిరోగమనంలో ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం టన్నుకు రూ.20 వేలు ఇప్పించాలని కోరుతున్నారు.పండిన ఆయిల్‌పామ్ గెలలను గానుగ ఆడించి, ముడి చమురును పెద్దాపురం, నల్లజర్లలోని యర్నగూడెంలలో మిల్లులకు తరలిస్తుంటారు. ఆయా మిల్లుల్లో ప్రతి నెలా సగటు ముడి చమురు నిష్పత్తి (ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో-ఇఒఆర్) ఆధారంగా అధికారులు, వ్యాపారుల కమిటీ ఆయిల్‌పామ్ గెలలకు ధర ప్రకటిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆయా దేశాల నుంచి క్రూడ్ పామాయిల్ (సిపిఒ) దిగుమతి నిలిచిపోయింది. దేశీయంగా వంట నూనెలను ఉత్పత్తి చేసే కంపెనీలకు ముడిసరుకు కొరత ఏర్పడింది. రైతుల నుంచి ఆయిల్‌పామ్ గెలలను ఆయా కంపెనీలు పోటీపడి కొనుగోలు చేశాయి.కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని ఇటీవల ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు, ఆయిల్‌పామ్ గెలల కొనుగోలు ధరలను భారీగా తగ్గించాయి. ఈ ఏడాది జనవరిలో రూ.17,000, ఫిబ్రవరిలో రూ.19,300 మార్చిలో రూ.21,940 ఏప్రిల్‌లో రూ.22,518, మేలో రూ.23,365 చొప్పున ధరలు చెల్లించాయి. ఆయిల్‌పామ్ సాగు దిశగా రైతులు ఆసక్తి చూపించారు. జూన్‌లో టన్నుకు రూ.20,451 చెల్లింపులతో మొదలై ప్రతి నెలా ధరలు తగ్గించుకుంటూ వస్తున్నాయి. జులైలో రూ.16,921, ఆగస్టులో రూ.16,269, సెప్టెంబరు, అక్టోబరులలో రూ.13,058కు ఆయిల్‌పామ్ ధరలు పతనమయ్యాయి. నాలుగు నెలల్లోనే టన్నుకు రూ.10,307కు ధర పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తమవుతోంది.