అనంతపురం, నవంబర్ 10,
జగన్ పార్టీలో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవులకు సీనియర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ పరువు బజారున పడకండా ఉండేందుకు రాజీనామాల ప్రకటన వద్దని వైసీపీ అగ్రనాయకత్వం బుజ్జగింపులను కూడా వినే పరిస్థితుల్లో సీనియర్లు లేరు. పార్టీ ప్రతిష్ట మంటగలిసినా బేఫికర్ అంటూ తమ అసమ్మతి గళాన్ని విప్పుతున్నారు. వారిలో అసంతృప్తి ఎంతగా గూడు కట్టుకుందంటే.. తమ రాజీనామాతో హైకమాండ్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.పార్టీలో అసమ్మతి జ్వాలలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయన్న వార్తలు చాలా కాలంగానే వినవస్తున్నాయి. వైసీపీ శ్రేణులు కూడా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు ఏమీ పెద్దగా ప్రయత్నించలేదు. జగన్ ఎప్పుడైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారో.. నాటి నుంచే వైసీపీ అప్పటి దాకా మూసి ఉంచిన గుప్పెట తెరిచేసినట్లైంది. జగన్ మాటే వేదం, ఆయన నిర్ణయమే శిరోధార్యం అంటూ పార్టీలో అప్పటి దాకా ఉన్న బిల్డప్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత మటు మాయమైంది. బహిరంగంగా నిరసనలు వెల్లువెత్తాయి, జగన్ స్వయంగా బుజ్జగింపులకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఎలాగో అప్పటికి పరిస్థితి సద్దుమణిగినా.. అప్పటి నుంచి వైసీపీలో అసమ్మతి జ్వాలలు నివురుగప్పిన నిప్పులా అలాగే ఉన్నాయి.అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఇక ఆయన స్థానంలో మరొకరిని నియమించాలన్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఈ పరిస్థితి ఒక్క అనంతపురం జిల్లాకే పరిమితం కాలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి సుచరిత రాజీనామా చేశారు. ఇదే దారిలో పలు జిల్లాల అధ్యక్షులు ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను ఒక బుజ్జగింపు విధానంగా మార్చింది. తొలి సారి మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన వారికీ, అలాగే మంత్రిపదవులు ఆశించి రానివారికీ తాయిలం ఇచ్చినట్లుగా జిల్లా అధ్యక్ష పదవులను కట్టబెట్టింది.మీమీ జిల్లాలలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే ఆ అభ్యర్థికి మంత్రి పదవి గ్యారంటే అని జగన్ బంపరాఫర్ కూడా ఇచ్చారు. అంటే జిల్లా అధ్యక్షులకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకావం ఉండదు.. ఎవరినో గెలిపించడానికి, వారికి మంత్రిపదవి ఇప్పించడానికి కష్టపడాలా అన్న భావన వారిలో నెలకొంది. ఈ కారణంగానే పార్టీ పదవులంటే వద్దు బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది.
ఫ్రస్టేషన్ లో వైసీపీ నేతలు
ఒక ఎమ్మెల్యే అధికారులపై మండిపడతారు. మరో ఎమ్మెల్యే మహిళలను వెటకారం చేస్తారు. ఇంకో ఎమ్మెల్యే బూతులే స్తోత్రాలు మాదిరిగా మాట్లాడతారు. ఒక ఎమ్మెల్యే ప్రజల్ని ప్రాంతీయ విభేదాలతో రెచ్చగొడతారు. ఇంకొకరైతే రాజీనామా పేరుతో ఒక డ్రామాకు తెరలేపుతారు. ఒక మహిళా ఎమ్మెల్యే.. ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా ‘మధ్య వేలు’ చూపించి మరీ యువతను రెచ్చగొడతారు. మరో ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ మంత్రి చొక్కా చేతులు మడతపెట్టి రౌడీలా రంకెలు వేస్తారు. మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయితే.. ప్రతి మాటలోనూ వెటకారం నింపకుండా మాట్లాడరు. వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి అయితే.. బిల్డప్ ల మీద బిల్డప్ లు ఇస్తుంటారు. వీరందరి ‘ముఖ్య’ నాయకుడు వారెవరినీ నియంత్రించే పనే చేయరు. పైగా వారిని ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో జనం మధ్యకు పంపిస్తుంటారు. ఇదండీ.. ప్రస్తుతం ఏపీలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, వారి ముఖ్య నేత తీరు.వైనాట్ 175 అవుటాఫ్ 175 వైసీపీ అధినేతకు ఇప్పుడు పట్టుకున్న పిచ్చి ఇది. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీని గెలిపించి, తమ నెత్తి మీదకు తెచ్చుకున్న ఆంధ్రా జనం వచ్చే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో జగన్ పార్టీని గెలిపించాలట. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతిపక్షం అనేదే లేకపోతే అధికార పార్టీకి కళ్లెం వేసేవారు ఎవరుంటారసలు? మొత్తానికి మొత్తం సీట్లలో వైసీపీయే గెలిచేస్తేనే.. తన అధికారదాహం తీరుతుందని ఆ పార్టీ అధినేత అనుకుంటున్నారా? అని జనం నుంచి ప్రశ్న వస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ తన నేతృత్వంలో రాష్ట్రాన్ని ఇప్పటికే అదఃపాతాళానికి నెట్టేశారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఆమడదూరం పోయింది. రోడ్ల దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు. ఖజానా ఖల్లాస్ అయిపోయింది. రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు అవమానంగా మారింది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా జగన్ రెడ్డి ఏవేవో పనికిమాలిన పనులు చేస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల ముందు జగన్ గొప్పగా చెప్పిన ‘నవరత్నాలు’ ‘నవ ద్రోహాలు’గా మారాయంటూ పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.రాష్ట్రాన్ని, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ సీట్లలో విజయం సాధించాలట. లేదంటే సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల సీట్లకు ఎసరు తప్పదని, వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ వారిని బెదిరిస్తుండడం గమనార్హం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల చెవుల్లో తమ అధినేత వార్నింగే ‘రింగ్ రింగ్’మంటూ మోగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు దక్కే ఛాన్స్ లేదనుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలైతే.. అవకాశం లేని చోట ఎంత కష్టపడి ఏమి లాభం అనుకుని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారు. పార్టీని ఎలా గెలిపించాలి? తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దాని కంటే.. మళ్లీ ఎలా సీటు సంపాదించాలనే అంశంపైనే మల్లగుల్లాలు పడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.ఒక పక్కన సొంతంగా చేయించుకుంటున్న సర్వేల నివేదికలు, ఇంకో పక్కన ‘ఐ ప్యాక్’ బృందం తరచుగా అందజేస్తున్న సర్వే ఫలితాలు జగన్ ను గందరగోళంలో పడేస్తున్నాయంటున్నారు. అయినప్పటికీ ఆయన ‘బురదపాము కోపం’ మాదిరిగా తన పార్టీ ఎమ్మెల్యేలపై కస్సుబుస్సులాడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఏతా వాతా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదనేది వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా సరే ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ చందంగా తనకు 175 సీట్లు వచ్చి తీరాలనే పంతానికి జగన్ పోతుండడం గమనార్హం. ఆ క్రమంలోనే తన సిటింగ్ ఎమ్మెల్యేలను జనంలోకి తోస్తుండడం విశేషం. పోనీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను స్థానిక ప్రజలు ఏమైనా గౌరవిస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. పైగా ముఖం మీదే వారిని సమస్యలపై కడిగిపారేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటే.. ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లు మారిపోయిందంటున్నారు