న్యూయార్క్, నవంబర్ 10,
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాలో పనిచేసే ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించింది. దాదాపు11 వేల మందిని రోడ్డున పడేసింది. ప్రపంచవ్యాప్తంగా 87 వేల మంది మెటా ఉద్యోగులు ఉండగా వీరిలో దాదాపు 13 శాతం ఉద్యోగాలపై కోత విధించినట్లైంది. జాబ్ కోల్పోయిన వారికి 16 వారాల ఆదనపు జీతంతోపాటు, కుటుంబ సభ్యులకు 6 నెలలపాటు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు మెటా ప్రకటించింది. కాగా 2004లో సంస్థను ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాకుండా మునుముందు రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెటాలో జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు ఇమ్మిగ్రేషన్ సదుపాయం కల్పించనున్నామని, ఇమ్మిగ్రేషన్ స్పెషలిస్టులను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు జుకర్ బర్గ్ ఈ సందర్భంగా తెలిపారు. పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించే ముందు నోటీస్ పీరియడ్, వీసా గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ టైంలో ప్లాన్ చేసుకోవాలని జుకర్‌బర్గ్ సూచించారు.సాధారణంగా భారత్, చైనాల నుంచి హెచ్1బి వీసాపై అమెరికాలో ఉద్యోగం చేసేవారి సంఖ్య తక్కువేమీకాదు. హెచ్1బి వీసాతో విదేశాల్లో మూడేళ్లపాటు ఉద్యోగం చేయవచ్చు. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునేందకు అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో హెచ్1బి వీసాదారులకు 60 రోజులు డెడ్‌లైన్ ఉంటుంది. ఈలోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కుంటే.. ఆ ఉద్యోగం ఇచ్చిన కంపెనీ హెచ్1బి వీసాకు స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా 60 రోజుల గ్రేస్ పిరియడ్‌లో జరగకపోతే అమెరికా నుంచి వెనుదిరగాల్సి ఉంటుంది. దీంతో ఉద్యోగుల్లో గుబులు నెలకొంది.