YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తెలుగు రాష్ట్రాల్లో మోడీ టూర్ కాక

తెలుగు రాష్ట్రాల్లో మోడీ టూర్  కాక

హైదరాబాద్, నవంబర్  10, 
ప్రధాని రాక తెలుగురాష్ట్రాల్లో కాకరేపుతోంది. ఓ వైపు ఏపీలో అధికారపార్టీ ప్రధాని మోదీ పర్యటనని ప్రభుత్వ పర్యటనగా మార్చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు  తెలంగాణలో ఈసారైనా మోదీకి కెసిఆర్‌ వెల్‌కమ్‌ చెబుతారా లేదా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో మోదీ భేటీ ఉంటుందా? లేదా? అన్నదానిపై కూడా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఏ రకంగా టర్న్‌ తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. అంతేకాదు ఎవరు.. ఎప్పుడు.. ఎలా భేటీ అవుతారో ఎందుకు ఈ మీటింగ్‌ ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడలానే ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఆసక్తిని రేపుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవాలు చేసేందుకు మోదీ ఈనెల 11న సాయంత్రం రానున్నారు. 11 వతేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారు. కంచెర్ల పాలెం నుంచి ఓల్డ్ ఐటీఐ వరకు 1కిలోమీటర్ల రోడ్ షో ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ రోడ్ షో ఉంటుంది. 11 రాత్రి ఐఎన్‌ఎస్‌ చోళలో ప్రధాని బస చేస్తారు. 12న 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. ఇందులో 152 కోట్లతో చేపట్టే విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైంది. ఇది లక్షకుపైగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకురుతుంది. కోల్డ్ స్టోరీజీ, ఏసీ ఆక్షన్ హాల్, కొత్త జెట్టీల నిర్మాణం లాంటివి ఉన్నాయి. రాయ్‌పూర్-విశాఖ ఎకనామిక్ కారిడార్, విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకూ డైరెక్ట్ రోడ్, గైయిల్ ద్వారా శ్రీకాకుళం నుంచి ఒడిశాలోని వంగుల్‌ వరకూ పైప్ లైన్ నిర్మాణం, గుంతకల్లులో ఐవోసీఎల్‌ చేపడుతున్న ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యనున్నారు.మోదీ విశాఖ పర్యటన బీజేపీ, వైసీపీ మధ్య తీవ్ర దుమారం రేపుతోంది. మొదట ఈ పర్యటనను వైసీపీ హైజాక్ చేస్తోందని ఆరోపించిన బీజేపీ ఇప్పుడు మరిన్ని అంశాలు తెరపైకి తెస్తోంది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత విహంచాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.రాష్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వని కారణంగానే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు ఎంపీ జీవిఎల్. ఆయన మాటల్లో  "విజయవాడ-నర్సాపూర్-భీమవరం-గుడివాడ-నిడదవోలు రైల్వే లైన్ డెవలప్ చెయ్యడం జరిగింది. దీనిలో 50 శాతం రాష్ట్రవాటా ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఏపీలో మిగిలిన రైల్వే లైన్స్ అభివృద్ధి నిలిచిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వక పోవడమే. కనీసం పీఎమ్ సమక్షంలోనైనా సీఎం జగన్ వీటికి హామీ ఇవ్వాలని కోరుతున్నా. ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయి. రైల్వే జోన్‌ను ఆల్రెడీ ప్రకటన చేశాం. త్వరలో దీనిపై నిర్ణయం ఉంటుంది. రైల్వే జోన్‌పై ప్రత్యేకంగా వేరే ప్రకటన ఉంటుంది. ఇది అధికారిక పర్యటన కాబట్టి పవన్‌కి ఆహ్వానంపై పీఎంవో నిర్ణయం తీసుకుంటుంది. ప్రధాని విశాఖ పర్యటనను రాజకీయాల కోణంలో చూడొద్దు. రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు. హుందాతనాన్ని కోల్పోవద్దు (రిషికొండ చుట్టూ ప్రధాని రౌండ్ వెయ్యాలి అన్న టీడీపీ వ్యాఖ్యల పై) ప్రధాని ఒకటిన్నర రోజు విశాఖలో గడపడం అనేది వైజాగ్ ప్రజలకు ఎంతో  గర్వకారణం" అని జీవీఎల్  పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికీ, బీజేపీ బలోపేతం కావడానికి పీఎం టూర్ టేకాఫ్ అవుతుంది కమలనాథులు భావిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యు ఈ పర్యటనలో లేదు, మరోవైపు రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఒకే కానీ రైల్వే జోన్ సంగతేంది అని విశాఖ వాసులు అడుగుతున్నారు. మోదీ పర్యటన షెడ్యూల్‌ మొత్తం అధికారక కార్యక్రమాలకే కేటాయించారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రారంభోత్సవాలకు ప్రధాని వస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ప్రొగ్రాం అని జీవిఎల్ అంటున్నారు. ఈ పర్యటనను హైజాక్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రధాని వచ్చేది రాష్ట్రానికి, రాష్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. బీజేపీ నేతలు మోదీని అధికారక కార్యక్రమాల్లో కలిసే వీలు లేకుండా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏపీ కమలం నేతలు కూడా అధికారపార్టీకి పోటీగా వ్యూహరచన చేస్తున్నారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు పెద్దల ద్వారా చర్చలు జరుపుతున్నారు. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా కలిసే అవకాశాలు లేకపోలేదన్న టాక్‌ వినపడుతోంది. ఇప్పటి వరకైతే ఇటు బీజేపీ అటు జనసేన నుంచి ఎలాంటి ప్రకటన లేదు. పొత్తుల విషయంగా ఇప్పటికే జనసేనతో కొనసాగుతామని బీజేపీ చెప్పినా పవర్‌ స్టార్‌ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. అదీ కాకుండా ఈ మధ్యన సమయం వచ్చినప్పుడల్లా బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు పవన్ కల్యాణ్. విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన ఉద్రిక్తత పరిస్థితులతో చంద్రబాబు, పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకువచ్చారు. అందుకే ఇప్పుడు విశాఖ పర్యటనలో మోదీతో పవన్‌ భేటీ ఉంటుందన్న ఊహగానాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ మోదీ, పవన్ కలిస్తే మాత్రం వైసీపీ తీరుపై ఫిర్యాదు కూడా చేసే అవకాశాలున్నాయని సమాచారం. విశాఖలో కలిసే వీలు లేకపోయినా హైదరాబాద్‌లో తప్పకుండా కలిసే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని ప్రారంభించనున్నారు. ఈసారైనా ప్రధానికి తెలంగాణ సిఎం కెసిఆర్‌ స్వాగతం పలుకుతారా లేదా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు మోదీ వచ్చినా కానీ కెసిఆర్‌కు బదులు మంత్రి తలసాని ఆహ్వానించారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ప్రకటించిన తర్వాత తొలిసారిగా మోదీ తెలంగాణకు వస్తున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ ఆహ్వానిస్తారా... లేకుంటే వేరే వ్యూహంతో ముందుకెళ్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

Related Posts