YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంక్షేమ పథకాలు అక్కరకు వస్తాయా

సంక్షేమ పథకాలు అక్కరకు వస్తాయా

విజయవాడ, నవంబర్11, 
2019 లో జరిగిన ఎన్నికలు వైసీపీ బుక్ లో ఒక చారిత్రాత్మక పేజీ. మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన జగన్ వల్లనే వైసీపీ అద్భుతమైన విజయం సాధించిందన్నది ఎంత వాస్తవమో... కార్యకర్తల శ్రమ కూడా అంతే నిజం. ఆ నిజాన్ని విస్మరించడానికి వీలులేదు. ఎందుకంటే శక్తికి మించి పనిచేసింది కార్యకర్తలే. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు పోరాడారు. ఒకరకంగా టీడీపీని ఓడించేందుకు వారు చిందించిన స్వేదం ఎవరూ మరవకూడదు. ఎమ్మెల్యేలు 151 మంది అసెంబ్లీలో ఉన్నారంటే జగన్ ఫేస్ ఎంత ముఖ్యమో.. కార్యకర్తల బేస్ కూడా అంతే ముఖ్యం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ముఖ్యమైన కార్యకర్తలను పక్కన పెట్టేశారు. ఇతరులకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు కార్యకర్తలు తమ శ్రమతో పాటు ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. వారి స్థాయిలో ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో వింటున్నాం. వైసీపీ సోషల్ మీడియాలోనే వాళ్లు బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎమ్మెల్యేలను తమను పట్టించుకోకపోవడాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే ఇదే సమయంలో జగన్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కుప్పం, రాజాం, టెక్కలి, అద్దంకి వంటి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలతో జగన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో జగన్ చెప్పడమే తప్ప క్యాడర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీపై ప్రజలకున్న అభిప్రాయాన్ని తెలుసుకునే వీలున్నా జగన్ ఆ పనికి పూనుకోవడం లేదు. మరోసారి ఈయనను గెలిపించుకురండి తాను చూసుకుంటానని మాత్రమే భరోసా ఇస్తున్నారు. అయితే జగన్ సమీక్షకు హాజరైన కొందరు కార్యకర్తలతో మాట్లాడితే ఈ సమీక్షల వల్ల ఉపయోగం లేదని చెబుతున్నారు. తాము ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరి, వారిపట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చెబుదామని పాయింట్లు రాసుకుని మరీ సమావేశాలకు వెళితే అక్కడ మాత్రం తమకు ఆ అవకాశం లేకుండా పోతుందని వాపోతున్నారు. ఎమ్మెల్యేలు తమకన్నా అవతలి పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, వారికే లాభం చేకూరేలా వ్యవహరిస్తున్నారని వారు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ లో ఇలాగే నిరుత్సాహం, నిరాశలు ఉంటే వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టమేనని చెప్పక తప్పదు. సిట్టింగ్ ల వల్ల ఈసారి ముప్పే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదన్న కామెంట్స్ వినపడుతున్న నేపథ్యంలో జగన్ ఇప్పటికైనా జాగ్రత్త పడితే మంచిది. సంక్షేమ పథకాలనే నమ్ముకుంటే పొరుగు రాష్ట్రంలో జరిగిన మునుగోడు ఫలితాలు చూశారుగా... అక్కడా వెల్్ఫేర్ స్కీంలు పెద్దగా పనిచేయలేదు. ఇది గుర్తుంచుకుని సరైన ఫీడ్ బ్యాక్ క్యాడర్ నుంచి తీసుకుని జరుగుతున్న తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేయగలిగితే జగన్ తో పాటు ఆయన పార్టీకి మంచిది. లేకుంటే.. ఒక్క ఛాన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

Related Posts