గుంటూరు, నవంబర్ 11,
ఏపీ రాష్ట్రంలో అధికార పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ దిగజారిపోతోందనే అంచనాలు పెరిగిపోతున్నాయి.‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని 2019 ఎన్నికల ముందు.. ఊరూరా తిరిగి అర్థించిన వైసీపీ అధినేత తీరా అధికార పీఠం ఎక్కిన తర్వాత చేస్తున్న పనులతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి, జగన్ కు పల్లెల్లో అధికశాతం జైకొట్టాయి. పట్టణ ప్రజల్లోనూ ఎక్కువ మంది ఆయనకే ఓటు వేశారు. యువకుడైన జగన్ ఏపీ అభివృద్ధికి, తమ బాగు కోసం ఏదో చేస్తారనే ఆశతో ఓట్లు వేసి భారీ విజయం కట్టబెట్టారు.నిజానికి పట్టణ ఓటర్ల మద్దతు ఎప్పుడూ చంద్రబాబుకే ఉండేది. చంద్రబాబు హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పట్టణ యువకుకు ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఆర్థికంగా వారు ఎదగారు. బాబు చేసిన అభివృద్ధి ఫలాలు అందరికి పూర్తిగా అందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఏపీగా మారిన తర్వాత తొలిసారి 2014లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు దార్శనికతను, కార్యదక్షతను గుర్తించి గెలిపించారు. హైదరాబాద్ కన్నా దీటైన రాజధానిని నిర్మిస్తారని భావించారు. చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి ఆకాశమే హద్దు అవుతుందని ఆశించారు. అయితే.. విభజన గాయాలు, ప్రత్యేక హోదాను చంద్రబాబు సాధించలేకపోయారనే బాధతో జగన్ కి ఒక్క ఛాన్స్ ఇచ్చారు.ఏపీలోని 25 పార్లమెంటరీ స్థానాల్లోనూ వైసీపీని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ తీరా ఎన్నికలయ్యాక మాట మార్చడం జనానికి నచ్చలేదు. 22 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపించిన తర్వాత బీజేపీ సర్కార్ కు మన అవసరం లేదు. ప్రత్యేక హోదా సాధించడం కష్టం అని మడమ తిప్పేయడంతో జనంలో వ్యతిరేకత మొదలైందిపాలన ప్రారంభించిన తొలినాళ్లలో ప్రజా వేదికను కూలగొట్టడం ద్వారా విధ్వంస పాలనకు తెరలేపడం రాష్ట్ర జనానికి నచ్చలేదు. చంద్రబాబు హయాంలో పరుగులు పెట్టిన ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ‘రివర్స్ టెండరింగ్’ నెపంతో నిలిపేయడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నామంటూ.. అభివృద్ధిని అస్సలు పట్టించుకోకపోవడంతో వైసీపీ సర్కార్ పై వ్యతిరేక భావనలు మరింత పెరిగాయి.పథకాల పేరు చెప్పి రాష్ట్ర ఖజానాలోని నిధుల్ని ఇష్టారీతిన ఖర్చుపెట్టేసి, చివరికి ఏపీకి, ఏపీ ప్రజల నెత్తిన మోయలేని అప్పుల భారం పెట్టిన జగన్ తీరుపై జనంలో ఆగ్రహం ఎక్కువైంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే.. వారంతా రోడ్లపైకి వచ్చి పోరాటాలు, ఉద్యమాలు చేసే దాకా పరిస్థితి వెళ్లింది. మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధానే లేకుండా చేసిన జగన్ ను, ఆయన పాలనను, వైసీపీ సర్కార్ ను జనం దుమ్మెత్తి పోస్తున్నారు. నిరు పేదలకు గత ప్రభుత్వాలు దశాబ్దాల క్రితమే ఇచ్చిన ఉచిత ఇళ్లకు క్రమబద్ధీకరణ పేరుతో ఇప్పుడు డబ్బులు కట్టాలన్న వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిందిఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో జనంలో వైసీపీకి బాగా గ్రాఫ్ తగ్గిపోయిందంటున్నారు. మరీ ముఖ్యంగా అక్షర జ్ఞానం ఉన్న పట్టణ ప్రజల్లో వైసీపీ సర్కార్ తప్పిదాలపై వ్యతిరేకత మరింత తీవ్రంగా ఉందంటున్నారు. అంతే కాదు.. జగనే స్వయంగా చేయించుకున్న సర్వేలు, ఎన్నికల వ్యూహాలు రచించే ఐప్యాక్ బృందం సర్వేల్లోనూ జనం నుంచి వ్యతిరేకతే స్పష్టమైందని తేలింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై జగన్ చీటికి మాటికి ఫైర్ అవుతున్నారనే వార్తలు బయటికి వస్తున్నాయి. ఒక పక్కన అభివృద్ధి లేదు.. పైగా తామేదో గొప్ప పనులు చేసినట్లు జనాన్ని ఊదరగొట్టాలంటూ గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో తమను జగన్ పంపుతుంటే.. ఏం చేయాలో తెలియక ప్రజా ప్రతినిధులు కుమిలిపోతున్నారంటున్నారు. చేయని అభివృద్ధి గురించి ఏమి చెప్పాలి?.. సమస్యలపై స్థానికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక నిలువునా వారు జావగారిపోతున్న ఘటనలు ఉన్నాయి.ఇక.. వైసీపీలో కొత్త ముసలం పుట్టింది. పార్టీ జిల్లాల అధ్యక్ష పదవుల నుంచి సీనియర్లు ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు. ముందుగా తానేటి వనిత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని వదిలేశారు. తాజాగా కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే బాటలో మరికొందరు నేతలు కూడా పయనించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వచ్చే అవకాశం లేదకుంటున్న కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం జగన్ చెప్పిందే విన్న వారంతా తమ అధినేతపై అసంతృప్తి పెంచుకున్నారంటున్నారు. పార్టీ బాస్ ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశమే రాజీనామాలు చేస్తున్న వారిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.