ముంబై, నవంబర్ 11,
బీజేపీ అంటేనే ఒంటికాలిపై లేచే శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, జైలుకెళ్లాక టోన్ మార్చారు. ఫడ్నవీస్ పాలనను పొగడడం ఒక ఎత్తయితే, రేపోమాపో మోదీ ,అమిత్‌షాను కలుస్తానన్న కామెంట్‌తో మహా రాష్ట్రలో హీట్ మొదలైంది.. ముంబై జైలు నుంచి విడుదలైన తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వైఖరిలో మార్పు రావడం తీవ్ర సంచలనం రేపుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను.. శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రజలకు మేలు చేసే ఎన్నో నిర్ణయాలను ఫడ్నవీస్ తీసుకుంటున్నారంటూ కొనియాడారు. ఫడ్నవీస్ నిర్ణయాలను తాను స్వాగతిస్తునట్టు సంజయ్ చెప్పారు. పత్రాచాల్ స్కాంలో పీఎంఎల్‌ఏ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. తన ఆరోగ్యం బాగాలేదని, త్వరలో ఫడ్నవీస్‌ను కలుస్తానని అన్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌థాక్రేతో కూడా సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. తరువాత ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కూడా సమావేశమయ్యారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని పేర్కొన్నారు.జైలు నుంచి విడుదలైన తరువాత సంజయ్ రౌత్‌లో మాటల్లో గతంలోలా వేడిదనం తగ్గిపోయింది. ఆయన నుంచి ఘాటు వ్యాఖ్యలు కరువయ్యాయి. ఉద్దవ్ థాక్రేపై ఈగ కూడా వాలనివ్వని పేర్కొన్న సంజయ్ ఇప్పుడు మెత్తబడ్డారు. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ను.. బీజేపీ నేతలపై ఆయన పొగడ్తలు కురిపించడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలను తాము స్వాగతిస్తామంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నడుపుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. తాను మొత్తం వ్యవస్థను లేదా ఏ కేంద్ర సంస్థను నిందించనని చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ వైషమ్యాలు చూడలేదని విచారం వ్యక్తం చేశారు