న్యూఢిల్లీ, నవంబర్ 11,
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సీఈఓ చందన్ ఈడీకి ఫిర్యాదు చేశారు. విచారణతో తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరు చెప్పాలని తనపై తీవ్రంగా ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 16వ తేదీన ఈడీ అధికారులు తన ఇంటికి వచ్చి సోదాలు చేశారని, ఇంట్లో కొన్ని ఆర్టికల్స్, పేపర్స్ తీసుకుని వెళ్లారని వివరించారు చందన్. తన ఇంట్లో రైడ్ జరిగిన రోజే సాయంత్రం తనను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. కొంత మంది రిటైల్ వ్యాపారుల గురించి తన వద్ద సమాచారం తీసుకున్నారని చెప్పారు. తనకు తెలియని విషయాలు అడిగి, తనను ఇబ్బందులకు గురి చేశారన్నారు. విచారణ పేరుతో తనను తీవ్రంగా గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ దాడిలో తన కుడి చెవికి తీవ్రంగా గాయమైందన్నారు. ముందుగా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకుని, తర్వాత ప్రైవేటు ఆస్పత్రిలో చేరానన్నారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరును చెప్పాలని వారు తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు చందన్. ఈ ఫిర్యాదు ఇప్పుడు లిక్కర్ కేసులో సంచలనంగా మారింది.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు సీఐబీ కోర్టు కస్టడీ విధించింది. 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. అయితే, సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేయగా.. ఇప్పుడు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి కీలకసూత్రధారిగా ఉన్నారని కస్టడీ రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ మార్కెట్లో 30శాతం తన గుప్పిట్లో పెట్టుకున్నారని, బినామీ కంపెనీల ద్వారా శరత్ చంద్రారెడ్డి 9 రిటైల్ జోన్స్ పొందారని పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారన్నారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్లు ,విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారని ఈడి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. శరత్ కు చెందిన 3 కంపెనీల ద్వారా రూ.64 కోట్లు అక్రమంగా సంపాదించారని, సుమారు రూ.60కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.