ముంబై, నవంబర్ 11,
అది భారత దేశ వాణిజ్య రాజధాని.. అంతేనా ఉగ్రవాదులు దాడి చేయాలనుకుంటే ముందుగా మదిలో మెదిలే పేరు అదే.. ముంబై నగరం. ఇప్పుడు అక్కడ రిమోట్ డ్రోన్లు, పారాగ్లైడర్లు నిషేధం. ఆ నిషేధం ఏదో ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసు అధికారులు ఈ నిషేధాన్ని విధించారు.నెల రోజుల పాటు అంటే.. ఈ నెల 13 నుంచి డిసెంబరు 12 వరకు ముంబై నగరంలో కానీ, నగర శివార్లలో కానీ రిమోట్ డ్రోన్లు, పారాగ్లైడర్లు, చిన్నపాటి విమానాలను నిషేధిస్తూ అక్కడి పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగరంలో ఉగ్రదాడులు జరగవచ్చని ముందు జాగ్రత్తగా సీఆర్‌పీసీ సెక్షన్ 144 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘‘ ఉగ్రవాదులు, దేశ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉన్నందున డ్రోన్లను, పారాగ్లైడర్లను నిషేధిస్తున్నాం. వీటి ద్వారా నగరంలోని ప్రముఖుల మీద దాడులు జరిపే అవకాశం ఉంది. అంతేకాక బృహన్‌ముంబాయ్ పోలీస్ కమీషనరేట్ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఆటంకం జరగవచ్చు’’ అని ఆదేశాలలో ఉంది.