YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమ్మకాలు సరే... స్థాపన మరిచిపోయారా

అమ్మకాలు సరే... స్థాపన  మరిచిపోయారా

పీఎస్ యూలను అమ్మేయ్.. ప్రైవేటును పెంచేయ్.. మోడీ విధానమిదేనా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిగా మోడీ పాలన లక్ష్యం పీఎస్ యూలను తెగనమ్మడమేనా అనిపించేలా కనిపిస్తోంది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రం తెగనమ్మిన పీఎస్ యూల సంఖ్య 28. ఇప్పటి వరకూ దేశంలో ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేసిన రికార్డు మోడీ సర్కార్ దే అనడంలో సందేహం లేదు. పైగా ఈ అమ్మకాలన్నీ సంపన్నులకు అనుకూలంగానే జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి పారేసిన మోడీ ప్రభుత్వ రంగంలో ఒక్క సంస్థనైనా నెలకొల్పారా అంటే లేదనే సమాధానం వస్తుంది. మోడీకి ముందు ఉన్న ప్రధానులు దేశంలో ప్రభుత్వ రంగంలో సంస్థలను ఏర్పాటు చేసి వాటిని జాతికి అంకితం చేశారు. కానీ మోడీ మాత్రం తన ముందున్న ప్రధానులు జాతికి అంకితం చేసిన సంస్థలను తెగనమ్మి ఆయా సంస్థలలో పని చేస్తున్న కార్మికుల భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ దేశంలో దాదాపు 300 పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి.ప్రధానిగా ఎనిమిదేళ్ల కాలం పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా మోడీ రికార్డు అయితే సృష్టించారు కానీ, దేశ ప్రగతి, పురోగతి విషయంలో ఆయన పాలన, ఆయన విధానాలు తిరోగమనంలోనే ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. పీఎస్ యూలను తెగ నమ్ముతూ పాలన అంటే ప్రైవేటీకరణే అన్నట్లుగా మోడీ తీరు ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వాలు కూడా అనివార్యమైన పరిస్థితులు తలెత్తిన సమయాల్లో ప్రభుత్వ రంగ సంస్థల లో ప్రభుత్వ వాటాలను విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. మోడీ చేస్తున్నట్లు గా మొత్తం ప్రభుత్వ వాటాలను విక్రయించేసి ఆయా సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ లేకుండా చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. గత ప్రభుత్వాలు పీఎస్ యూలలో వాటాలు విక్రయించినా ఆయా సంస్థలపై ప్రభుత్వ ఆజమాయిషీ కొనసాగేలా అన్ని జాగ్రత్తలూ తీసుకునేవి. వాటాల విక్రయం కూడా పరిమితంగానే ఉండేది. అయితే మోడీ మాత్రం పీఎస్ యూలను వదిలించుకోవడమే ధ్యేయం అన్నట్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను వేలానికి పెట్టేస్తున్నారు.  టీమ్ ఇండియా స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి బాట పట్టిస్తానంటూ నాడు ప్రసంగాలూ వాగ్దానాలతో జనాన్ని మెస్మరైజ్ చేసి అధికారంలోకి వచ్చిన మోడీ.. ప్రధానిగా మాత్రం టీమ్ ఇండియా స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకూ, అన్ని ప్రాంతాలకూ సమన్యాయం అన్న మోడీ ఆచరణలో మాత్రం గుజరాత్ కే ఎక్కువ సమన్యాయం అన్న తీరులో వ్యవహరిస్తున్నారు. భారత దేశం అంటే రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల సమాహారం అన్నది విస్మరించి.. గుజరాత్ మాత్రమే బారత్ లో ఉందా అని ఇతర రాష్ట్రాలు అనుకునే విధంగా ఆయన నిర్ణయాలు, విధానాలు, వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెహ్రూ హయాంలో  దేశంలో 32 ప్రభుత్వ రంగం సంస్థలు ఏర్పాటయ్యాయి. అదే ఇందిరాగాంధీ హయాంలో 66 పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి. ఇక కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అధికారంలో ఉన్న జనతా పార్టీ హయాంలో అంటే మురార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన 9 పీఎస్ యూలను జాతికి అంకితం చేశారు. దేశంలో ఆధునిక టెక్నాలజీకి ద్వారాలు తెరిచిన రాజీవ్ గాంధీ హయాంలో కూడా 16 పీఎస్ యూలు దేశంలో ఏర్పాటయ్యాయి. ఇక వీపీసింగ్ హయాంలో 2   పీఎస్ యూలు ఏర్పాటయ్యాయి.సరళీకృత ఆర్థిక విధానాలకు అంకురార్పణ చేసిన పీవీ నరసింహరావు కూడా తన హయాంలో ఏకంగా 14 పీఎస్ యూలను జాతికి అంకితం చేశారు.  ఇక వాజ్ పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కూడా 17 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. అయితే ప్రబుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం కూడా ఆయన హయాంలోనే ఆరంభమైనా... చాలా పరిమితంగా మాత్రమే వాటాలను విక్రయించి పీఎస్ యూలపై ప్రభుత్వ హయాం ఇసుమంతైనా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించారు. అదీ పరిమితంగానే. అయితే మన్మోమన్ సింగ్ హయాంలో మూడు పీఎస్ యూలలో  వాటాల విక్రయంపై అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశాన్ని అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. దేశాన్ని అమ్మేస్తుంటే తాను మౌనంగా ఎలా ఉంటాను, ఒట్టేసి చెబుతున్నా..దేశాన్ని అమ్మనివ్వనంటూ గర్జించారు. పీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత ఇప్పటి వరకూ దేశంలో ఒక్క ప్రభుత్వ సంస్థ ఏర్పాటు కాలేదు సరికదా.. 23 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేశారు. అదే సమయంలో ఆయన కేబినెట్ లో ఆర్దిక శాఖ నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్ మాత్రం ప్రభుత్వం ఉచిత సేవలు చేయదనీ, వ్యాపారమే చేస్తుందనీ చెబుతున్నారు. అందుకే లాభసాటిగా లేని పీఎస్ యూలను అమ్మేస్తున్నామంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో లక్షా 75 వేల కోట్ల రూపాయల రాబడి లక్ష్యంతో 28 ప్రభుత్వ రంగ సంస్థలను వేలం పెట్టినట్లు పెట్టి మరీ అమ్మేశారు. లాభాల బాటలో ఉన్న ఓఎన్జీసీ జీఎస్ పీసీలో 80శాతం వాటాలను 8 వేల కోట్లకు తీసుకునేలా మోడీ సర్కార్ చేసింది. అంతే కాదు ఓఎన్ జీసీ ఆ జీఎస్పీసీకి 13 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. గుజరాత్ లో ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సంస్థను కాపాడేందుకు లాభసాటిగా నడుస్తున్న పీఎస్ యూలను సంక్షోభంలోకి నెట్టడానికి కూడా వెనుకాడని మోడీ..మరి అదే విధానాన్ని మిగిలిన రాష్ట్రాలలో ఎందుకు అవలంబించడం లేదన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి..ఇంతకూ జీఎస్ పీసీపై మోడీకి అంత ప్రేమ ఎందుకంటే.. తాను ప్రధాని కావడానికి ఆ సంస్థ సోపానంగా ఉపయోగపడటమే. ఔను గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ రెండో సారి అధికారంలో ఉన్న సమయంలో ఆయన దేశం మొత్తం అచ్చెరవొందేలాంటి ప్రకటన ఒకటి చేశారు. దేశం చమురు దిగుమతుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా తమ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ గొప్ప ఇన్వెన్షన్ చేసిందనీ,  ఏపీలోని కృష్ణా గోదావరి బేసిన్ లో దాదాపు 2లక్షల 20 వేల కోట్ల రూపాయల విలువైన 20 ట్రిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలను గుర్తించిందనీ,  వీటిని వెలికి తీయడం ద్వారా 2014 నాటికి భారత్ దిగుమతి చేసుకుంటున్న 80 వేల కోట్ల చమురు దిగుమతుల అవసరం లేకుండా చేస్తామనీ ఉద్ఘాటించారు. అలా మిగిల్చిన 80 వేల కోట్ల రూపాయలనూ దేశంలోని పేదలకు పంచుతామని మోడీ చెప్పారు.ఆర్బీఐ నిబంధనలను కూడా తోసి రాజంటున్న మోడీ ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ  ఉక్కు కర్మాగారం విషయంలో సవతి తల్లిప్రేమ ఎందుకు చూపుతున్నారు.

Related Posts