అనకాపల్లి మండలం లో మంగళవారం రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పర్యటించారు. శంకరం లో అసంపూర్తిగా వున్న రాజీవ్ గృహకల్ప ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తో కలసి అయన పరిశీలించారు. ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్లను వినియోగించక పోవడానికి కారణాలు తెలుసుకున్నారు. తరువాత మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.50 వేల కోట్లతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 19 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. 2022 నాటికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గృహావసతి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో పట్టణ గృహనిర్మాణ పథకాల ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని అన్నారు. దీని ద్వారా పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.2.50 లక్షల రాయితీ తో ఇళ్లు మంజూరు చేస్తాం. ఇళ్ల స్థలాలు లేనివారికి ప్రభుత్వం స్థలం కొనుగోలు చేసి టిడ్కో సంస్థ ద్వారా బహుళ అంతస్థుల ఇల్లు నిర్మించి ఇస్తుందని వెల్లడించారు. విశాఖ జిల్లాలో యీ విధానంలో ఐదు నియోజకవర్గాల్లోని 276 గ్రామాల్లో 2.50 లక్షల సబ్సిడీపై ఇళ్లు మంజూరుకు అవకాశం వుందని అన్నారు. జర్నలిస్టుల గృహ నిర్మాణంపై మంత్రుల సబ్ కమిటీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. జర్నలిస్టుల అభీష్టం మేరకు ఐదు కేటగిరీ ల నుండి ఇళ్లను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. విశాఖ జిల్లాలో 90 శాతం హూద్ హూద్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని అయన అన్నారు.