న్యూయార్క్, నవంబర్ 12,
ట్విటర్‌ను టేకోవర్ చేశాక ఎలన్ మస్క్ ఆ కంపెనీలో చాలానే మార్పులు తీసుకొస్తున్నారు. వచ్చీ రాగానే లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఇప్పుడు ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చాడు. ట్విటర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపాడు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశాడు మస్క్. అంతే కాదు. ఎంప్లాయిస్ అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పాడు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్లకు మినహాయింపునిస్తానని స్పష్టం చేశాడు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించాడు.ఇప్పటికే ఎలన్ మస్క్ అందరి ఉద్యోగులకు "వర్క్ ఫ్రమ్ హోమ్‌ను" తొలగిస్తున్నట్టు మెయిల్ పంపాడు. వారానికి కనీసం 40 గంటల పాటు పని చేయాలని ఆదేశించారు. ట్విటర్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దాచాల్సిన పని లేదని అది అందరికీ తెలిసిన విషయమేనని మరోసారి గుర్తు చేశాడు. ఇప్పుడు కూర్చుని నింపాదిగా మాట్లాడుకోవాల్సిన సమయం కాదని, కేవలం యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూతోనే ట్విటర్ నడుస్తోందని అసహనం వ్యక్తం చేశాడు. అందుకే...ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని తేల్చి చెప్పాడు. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అందరూ కష్టపడితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మెయిల్‌లో ప్రస్తావించాడు మస్క్. మస్క్ మామ మరో ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నాడు. ట్విటర్ బ్లూ యూజర్స్ నుంచే డబ్బులు వసూలు చేస్తానని చెప్పిన మస్క్...ఇప్పుడు అందరి యూజర్స్ నుంచీ సబ్‌స్క్రిప్షన్ ఫీజు వసూలు చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆ బాంబు పేలుస్తాడేమో చూడాలి. ఈ మధ్యే ఎంప్లాయిస్‌తో జరిగిన మీటింగ్‌లో ఎలన్ మస్క్ ఈ ఆలోచనను ప్రస్తావించాడట. కొన్ని రోజుల వరకూ ఉచితంగా వాడుకోటానికి అనుమతినిచ్చినా...తరవాత సబ్‌స్క్రిప్షన్ ఫీ వసూలు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే...ఎప్పటిలోగా ఈ రూల్ అమల్లోకి వస్తుందన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. వెరిఫైడ్ అకౌంట్ యూజర్స్ అందరూ కచ్చితంగా నెలకు 8 డాలర్లు చెల్లించాలని మస్క్ ప్రకటించాడు. ఇండియన్ ట్విటర్ యూజర్స్ అయితే నెలకు రూ.719 చెల్లించాల్సి ఉంటుంది. భారత్‌లోని ఐఫోన్ యూజర్స్‌కి ఇప్పటికే పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మెసేజ్‌లు పంపుతోంది ట్విటర్ సంస్థ. ఈ నిర్ణయం ట్విటర్ కంపెనీలో "గేమ్ చేంజర్"గా మారుతుందని మస్క్ భావిస్తున్నారు. మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకోటానికి 44 బిలియన్ డాలర్లు చెల్లించాడు. వీటిని రికవరీ చేసుకోటానికి ఈ పెయిడ్ ఫీచర్‌లు ఎనేబుల్ చేస్తున్నాడన్న వాదనా వినిపిస్తోంది. కానీ...ఈ ఫీచర్‌పై మస్క్ మొండి పట్టు వీడటం లేదు. ట్విటర్ యూజర్లు ఎంతగా విమర్శలు చేస్తున్నా వాటిని పెద్దగా పట్టించుకోవటం లేదు. తప్పకుండా చెల్లించాల్సిందే. అని తేల్చి చెబుతున్నాడు. ట్విటర్‌లో వరుస ట్వీట్‌లతో తన అభిప్రాయాలు సూటిగా చెప్పేస్తున్నాడు.