విజయవాడ, నవంబర్ 14,
ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ గా సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి నియమితులయ్యే అవకాశాలున్నాయి. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిర్దోషిగా పరిగణించి తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇస్తూ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆమెపై ఉన్న అభియోగాలను ధర్మాసనం కొట్టివేసింది. ఓబుళాపరం కేసులో సీబీఐ ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలులో గడపాల్సి వచ్చిన సంగతి విదితమే.మైనింగ్ కు పాల్పడిన వారికి ఐఎఎస్ అధికారిగా శ్రీలక్ష్మి సహకరించారన్న ఆరోపణలతో పాటు భారీ ముడుపులు తీసుకున్నారనీ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ ఆరోపణల్లో సాక్ష్యాధారాలు లేనందున ఆమెపై అభియోగాలన్నింటినీ కోర్టు కొట్టివేస్తూ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గనుల కేటాయింపులో ఆయాచిత లబ్ధి కలిగించారన్న ఆరోపణలతో అరెస్టయి, దాదాపు ఏడాది పాటు జైల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత శ్రీలక్ష్మి తెలంగాణ కేడర్‌లో ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని దరఖాస్తు చేసుకోగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ కేడర్‌కు రాగానే ఆమెకు పురపాలకశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.పురపాలకశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి లెవెల్ 15కి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆ శాఖలోనే ముఖ్య కార్యదర్శిగా నియమించింది. వాటిని రెగ్యులర్ ప్రమోషన్లుగానే పరిగణించారు. ఆమెపై పెండిం గ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉంటుందని అప్పటి ఉత్త ర్వుల్లో ప్రస్తావించారు. దాన్ని అడ్‌హాక్ ప్రమోషన్‌గా పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు తీర్పుతో ఆమె ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు తొలగి పోయాయనే చర్చ జరుగుతోంది.కాగా...ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.నిజానికి కేంద్ర కాబినెట్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సిన శ్రీలక్ష్మిపై, సీబీఐ కేసు వల్ల ఆమె కెరీర్ ఒకింత వెనుకబడిందనే చెప్పాలి. ఏపీ సీఎస్ రేసులో మరో సీనియర్ ఐఏఎస్ జవహర్‌రెడ్డి ఉన్నప్పటికీ, సీఎం జగన్ శ్రీలక్ష్మి వైపే ఉంటుందని అధికార వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మ పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఇప్పటికే పొడిగింపుపై పనిచేస్తున్న సమీర్‌కు, ఇక పొడిగింపు అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. దానితో సీఎం జగన్ ఏరికోరి తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి తెచ్చుకున్న.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మికి, సీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా కూడా అడహక్ పద్ధతిలో ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఏపీ సీఎస్ గా శ్రీలక్ష్మికే ఎక్కువ అవకాశాలున్నాయని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్రీలక్ష్మిపై సీబీఐ పెట్టిన సెక్షన్లు చెల్లవంటూ, హైకోర్టు సింగిల్ జడ్జి ఆమెకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఆమెపై ఎలాంటి కేసులు లేనట్లే లెక్క. నిబంధనల ప్రకారం సీబీఐ కేసులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును, అదే కోర్టు ఫుల్‌బెంచ్‌లో సవాల్ చేయడానికి అవకాశాలు లేవు, సీబీఐ ఈ తీర్పును సవాల్ చేయాలనుకుంటే సుప్రీం కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో రిటైరయ్యే సీఎస్ సమీర్‌శర్మ స్థానంలో, శ్రీలక్ష్మి సీఎస్ కావటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక సీబీఐ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లినా కూడా, హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును అనుసరించి, ఆమెను సీఎస్‌గా నియమించడానికి అది అవరోధం కాదని అంటున్నారు. సీబీఐ ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళితే, ‘సుప్రీంకోర్టు తీర్పు మేరకు భవిష్యత్తు పరిణామాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్న’ నిబంధనలతో’ శ్రీలక్ష్మిని సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.