విశాఖపట్టణం, నవంబర్ 14,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ డబుల్ గేమ్ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక పక్కన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొడుకు మాదిరిగా ట్రీట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. జగన్ పట్ల మోడీ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారని పలువురు కేంద్ర మంత్రులు కూడా సమయం చిక్కిన ప్రతీసారీ చెబుతుంటారు. దాంతో పాటుగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అవినీతి, వైఫల్యాలపై మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఛార్జిషీట్లు సిద్ధం చేసి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తన పార్టీ కోర్ కమిటీ నేతలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేస్తారు. దాంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ కూడా చేయాలని ఆదేశిస్తారు. మోడీ ఏపీ పర్యటనకు రెండు రోజుల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తనను కలవాలని పేర్కొంటూ పీఎంఓ నుంచి సమాచారం పంపించడం ఆసక్తికరంగా ఉంటుంది.ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఏకం చేసేందుకు కృషిచేస్తానంటూ పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా బహిరంగంగానే చెబుతున్నారు. ఆ క్రమంలో ఆయన టీడీపీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ ఘటన తర్వాత, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా వైసీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో చంద్రబాబుకు పవన్ దగ్గర కాకుండా చేయాలనే వ్యూహంతోనే ఇన్నేళ్ల తర్వాత జనసేనానితో మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారనే అనుమానాలు వస్తున్నాయి. ఒక పక్కన తమ మిత్రుడు అని చెప్పుకుంటూనే.. పవన్ అడిగిన రోడ్ మ్యాప్ ఇవ్వకుండా తాత్సారం చేస్తారు. మరో పక్కన వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఆ దారిలో ముందుకు వెళ్లకుండా బంధం వేయాలనే వ్యూహం ఏదో బీజేపీ చేస్తోందని అపిస్తోందంటున్నారు.మోడీ విశాఖలో పర్యటన కోసం వస్తున్న క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్ ఆహ్వానించాలి. అలాగే ఆహ్వానించారు. అలాగే చేశారు. మోడీ సభను సక్సెస్ చేయడం కోసం లక్షలాది మందిని తరలించారు. అయినప్పటికీ.. సభా వేదికపై ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి జగన్ ఒక్కరికే అవకాశం ఇవ్వడం గమనార్హం.మరో పక్కన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తుంది. విశాఖ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ అరగంటకు పైగా ఆయనతో మోడీ భేటీ అయ్యారు. విశాఖలో పవన్ కంటే ముందుగా బీజేపీ కోర్ కమిటీ నేతలతో మోడీ సమావేశం షెడ్యూల్ ఉన్నా.. ముందుగా పవన్ తోనే మోదీ భేటీ అయ్యారు. పది నిమిషాలే పవన్ కు ముందుగా సమావేశం ఇచ్చిన మోడీ 35 నిమిషాలు చర్చలు జరిపారు. కానీ.. బీజేపీకి ఎప్పటి నుంచో మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అడుగుతున్న రోడ్ మ్యాప్ మాత్రం ఇచ్చారో లేదో తెలియదు. మోడీతో భేటీ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలతో జనసేనకు ఉన్న సమస్యల్ని పవన్ కళ్యాణ్ లేవనెత్తినట్లు సమాచారం. అయితే.. ఆ సమస్యల పరిష్కారం గురించి పవన్ వద్ద మోడీ ఏమైనా పెదవి విప్పారా? అనేది మాత్రం బయటకు రావడం లేదు. ఇటీవలి తాజా పరిణామాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్- టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గర అవుతున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడారనేది తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరైనా బయటకు చెప్పాల్సి ఉందిమిత్రుడు పవన్ ను చాలా ఏళ్ల తర్వాత కలుసుకునేందుకు ప్రధాని మోడీ అవకాశం అయితే.. ఇచ్చారు.. కానీ భేటీ సందర్భంగా పవన్ చెప్పిన విషయాలపై ఆయన అంతగా స్పందించలేదనే అనుమానాలు వస్తున్నాయి. మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీడియాతో తాను చెప్పదలచుకున్న ‘ఎనిమిదేళ్ల తర్వాత మోడీతో భేటీ అయ్యాను. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన మీటింగ్. ఏపీలోని అన్ని విషయాలు మోడీ అడిగి తెలుసుకున్నారు. ఏపీకి మంచి రోజులు రానున్నాయనే విశ్వాసం పెరిగింది.’ అని చెప్పారు. అయితే.. మీడియా ప్రతినిధులు అడగబోయిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండానే పవన్ అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈసారి విశేషం. మీడియా ప్రతినిధులు ఎప్పుడు ఏ ప్రశ్నలు వేసినా ఓపిగ్గా విని సమాధానాలు చెప్పే పవన్ కళ్యాణ్ ఈ సారి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం కొట్టొచ్చినట్లు కనిపింది. పైగా మీడియా సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ ముభావంగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలపై ప్రధానికి వివరించారా? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేయడమే కాకుండా.. ఇవన్నీ త్వరలో తెలియజేస్తానని మీడియా సమావేశాన్ని ముగించుకుని పవన్ కళ్యాణ్వెళ్లిపోయిన తీరుచూస్తే పవన్ కళ్యాణ్ విషయంలో మోడీ ఏవిధంగా వ్యవహరించారో అనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు.వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీ వెళ్లకుండా చేయడమే తమ కార్యక్రమం అని బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి మాటలు ప్రస్తావించుకోవచ్చు. అంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసి పోటీకి వెళ్లకుండా చేయాలనేది ఆ పార్టీ వ్యూహం అని అర్థం అవుతోందంటున్నారు. మొత్తానికి ఏపీలో బీజేపీ రాజకీయంగా డబుల్ గేమ్ ఆడుతోందనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.