విశాఖపట్టణం, నవంబర్ 15,
దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ జోన్ కు అవసరమైన నిధులను కేటాయిస్తూ సోమవారం కేంద్రం ప్రకటించింది. తాజా ప్రకటనతో రైల్వే జోన్ ఏర్పాటుకు తొలి అడుగు పడినట్లైంది. తాజా ప్రకటనలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డులో రూ.106 కోట్ల నిధులతో కొత్త రైల్వే జోన్ కు చెందిన భవనాలను నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి దశలో భాగంగా పాత వైర్ లెస్ కాలనీలో 13 ఎకరాలను నూతన రైల్వే జోన్ కోసం కేంద్రం సేకరించింది. ఇందులో 8 ఎకరాల్లో నూతన రైల్వే జోన్ కు సంబంధించి మల్టీ స్టోరీ భవనాలను నిర్మించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకీకరణకు రూ.456 కోట్లను మంజూరు చేసింది. రైల్వే స్టేషన్ లో అదనంగా మరో 2 ప్లాట్ ఫారాలను నిర్మించనుంది.