ఆంధ్ర రాష్ట్రానికి చాతనైనంత సాయం చేశానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో మంగళవారం నాడు అయన జాతీయ విపత్తుల శిక్షణ సంస్థకు శంకుస్థాపన చేసారు.. తరువాత ఆయన మాట్లాడుతూ 36.76 కోట్ల వ్యయంతో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు కానున్న జాతీయ విప్తత్తుల శిక్షణ సంస్థ కు సంబంధించి భవన నిర్మాణాలు ఏడాది లోగా పూర్తవుతాయని పేర్కొన్నారు. అలాగే ఈ విపత్తుల సంస్థ చుట్టు పక్కల పలు ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. అతిపెద్ద కోస్తా తీరప్రాంతం ఉన్న ఏపీకి విపత్తుల శిక్షణ సంస్థ ఎంతో అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు. కాలం గతి తప్పుతోంది. రుతువులు క్రమం తప్పుతున్నాయి. ప్రకృతితో సహజీవనం చేయడం అలవరచుకోవాలని వెంకయ్య నాయుడు అన్నారు. భూమి, నీరు, ఆకాశం, వెలుతురును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ ఈ ప్రాంత ప్రతిష్ట పెంచనుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజూజు, మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.