హైదరాబాద్
ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. 1960లో ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీ నుంచి బిఎస్సీ పట్టా అందుకున్నారు. తొలుత నాటకాల్లో వేషాలు వేశారు. నాటకాల్లో రాణించడంతో మద్రాసు చేరుకుని సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించారు. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీ కృష్ణ తదితర చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు.