కృష్ణ మరణం పట్ల గవర్నర్ సంతాపం
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి (కృష్ణ) మరణం పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతాపం ప్రకటించారు. నటుడుగా, నిర్మాతగా, దర్శకునిగా, చిత్ర నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలు మరువలేనివన్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు, సామాజిక స్పృహ కల్పించే పలు చిత్రాలతో కృష్ణ జనాదరణ పొందారన్నారు. సొంత నిర్మాణ సంస్థ ద్వారా సినీ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణకే దక్కుతుందన్నారు. సూపర్ స్టార్ కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇందిరా గాంధీ ఆశయాలకోసం పని చేసిన వ్యక్తి శైలజానాధ్
కాంగ్రెస్ నేత, ప్రముఖ చలన చిత్ర నటుడు, సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల ఎపిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాధ్ సంతాపం తెలపారు. శైలజనాధ్ మాట్లాడుతూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్ధాల పాటు కృష్ణ అందించిన సేవలు మరువరానివి, మరుపురానివన్నారు. 350 కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం తెలుగు చిత్ర రంగానికి తీరని లోటు. విభిన్న కుటుంబ కధా చిత్రాలతో పాటు ప్రజలకు సామాజిక స్ప్రుహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడుగా కృష్ణ జనాదరణ పొందారు. 1989 లో ఏలూరు నుండి కాంగ్రెస్ ఎంపి గా పనిచేసి ప్రజలకు మరిన్ని సేవలందించారు. ఇందిరాగాంధీ ఆశయాలకోసం, రాజీవ్ గాంధీ స్వప్నాల కోసం అహర్నిశలు పనిచేశారు. కాంగ్రెస్ వాదిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ . అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దే సీఎం కేసీఆర్
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడుగా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం అన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు. నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి, సినిమా నిర్మాణ రంగంలో నూతన ఒరవడులను ప్రవేశ పెట్టిన ఘనత కృష్ణ దేనన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ మృతి బాధాకరం కళామతల్లి తన ముద్దు బిడ్డను కోల్పోయింది కింజరాపు అచ్చెన్నాయుడు
సూపర్ స్టార్ కృష్ణ మృతి బాధాకరం.నేడు కళామతల్లి తన ముద్దు బిడ్డను కోల్పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నిర్మాణ సంస్థ అధినేతగా తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కృష్ణ మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబం సబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్దిస్తున్నానని అయన అన్నారు.
కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. శ్రీ కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన కృష్ణ గారు కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే శ్రీ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు మహేష్ బాబు కి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను
కళామతల్లి ముద్దుబిడ్డ ఘట్టమనేని కృష్ణ నందమూరి బాలకృష్ణ సంతాపం
నటనలో కిరీటి, సాహసానికే మారుపేరు, సాంకేతికతలో అసాధ్యుడు, స్వయంకృషితో ఎదిగిన సూపర్ స్టార్, అపర దానకర్ణుడు.. ఘట్టమనేని కృష్ణ. తెలుగులో కౌబాయ్ సినిమాలకు ఆద్యుడు, గూఢచారి( సీక్రెట్ ఏజెంట్ ) సినిమాల్లో ఘనాపాఠి. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఘనాపాఠి. వర్ధమాన నటులకు, కళాకారులకు ఆదర్శప్రాయుడు కృష్ణ. ఆయనలేని లోటు తీర్చలేనిది. సూపర్ స్టార్ కృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృష్ణ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని హిందూపూర్ శాసనసభ్యుడు
నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీరంగానికి తీరని లోటు మండలి బుద్ధప్రసాద్
సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సాహసానికి ప్రతీకగా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మా నాన్న మండలి వెంకట కృష్ణారావు కి కృష్ణ అత్యంత సన్నిహితులు. 1975 లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు నిధులు సేకరించడంలో కృష్ణ ప్రముఖపాత్ర వహించారు. 1977 మే లో అవనిగడ్డలో జరిగిన రాష్ట్ర నాటకోత్సవాలకు తన సతీమణి విజయనిర్మలతో కలిసి వచ్చారు. ఆ రోజు మా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు. 1977 నవంబర్ 19 న దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు 10 వేల రూపాయలు విరాళం ప్రకటించడమే కాకుండా, లక్ష రూపాయలు విలువచేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక సంవత్సరం పాటు తనకు వచ్చే ఆదాయంలో 10 శాతం తుఫాను బాధితులకు అందచేసిన దయార్దహృదయులు. కృష్ణ చేత మంగళగిరి లో స్టూడియో నిర్మాణం చేయించాలని మా నాన్న స్వయంగా వెళ్లి స్థలాన్ని ఎంపిక చేసారు. దురదృష్టవశాత్తు అది ఏ కారణం వల్లనో కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత హైదరాబాద్ లో పద్మాలయా స్టూడియో నిర్మించారు. "హీరో" అనేది ఆయనకు ఇంటి పేరయింది. సినిమా రంగంలోనే కాక, నిజ జీవితంలో కూడా "హీరో" అని అనిపించుకున్న కృష్ణ మరణం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నానని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.
అయన సేవలు అజరామరం మంత్రి కేటీఆర్
తెలుగు సినీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. 350 కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు అజరామరం అని కొనియాడారు. తెలుగు సినిమా చరిత్రలో విభిన్న తరహ పాత్రలను పోషించడంతోపాటు, అద్భుతమైన సినిమాలను నిర్మించి తెలుగు సినిమా చరిత్రలో తనదైన స్థానాన్ని సూపర్ స్టార్ కృష్ణ సృష్టించుకున్నారన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటన్న కేటీఆర్, కృష్ణ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.