విజయవాడ, నవంబర్ 16,
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటన తర్వాత రాజకీయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతం కంటే భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఒక్క చాన్స్ ఇవ్వమని ప్రజల్ని కోరుతున్నారు. అన్ని చోట్లా అభ్యర్థుల్ని పెడతానని.. ఎవరైనా అడ్డుకుంటే సంగిత చూస్తానని హెచ్చరిస్తున్నారు. నిన్నటిదాకా ఆయన ఓట్లు చీల్చబోనని అన్న ప్రకటనలకు.. ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు చాలా తేడా ఉంది. అందుకే పవన్ కల్యాణ్ రూటు మార్చుకున్నారా ? ఒంటరి పోరాటానికి మొగ్గు చూపుతున్నారా అనే వాదన వినిపించడం ప్రారంభమైంది. ప్రధానమంత్రి మోదీతో భేటీ జరిగిన మూడు రోజుల తర్వాత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. వీరుడు.. ధీరుడు అని దేశాన్ని క్లిష్టపరిస్థితుల నుంచి కాపాడుతున్నారని అభినందించారు. ఈ మర్మమేంటో రాజకీయవర్గాలకు అంతు చిక్కకుండా ఉంది. ఒక వేళ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పి ఉంటే సరిపోయేది కానీ ప్రత్యేకంగా ఇలా పొగడ్తలకు మూడు రోజుల తర్వాత సమయం కేటాయించడమే ఆశ్చర్యకరంగా ఉంది. మోదీ సమావేశం తర్వాత ఆయనకు ఏమైనా సందేశం వచ్చిందా లేకపోతే.. సమావేశంలో తమ మధ్య జరిగిన చర్చల్లో మోదీ చెప్పిన విషయంలో ఏదైనా కొత్తగా అర్థం అయిందా అనేదానిపై క్లారిటీ మాత్రంలేదు. విజయనగరం జిల్లా గుంకలాన్ గ్రామంలో జగనన్న ఇళ్లలో అవినీతిపై పోరాటానికి వెళ్లి ప్రసంగించిన సందర్భంలో పవన్ కల్యాణ్ ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. అంతే కాదు అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థిని పెడతా.. నామినేషన్ వేయనివ్వకపోతే ఎం చేయాలో తెలుసని హెచ్చరించారు. నామినేషన్ వేయనిస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే అన్ని చోట్లా పోటీ చేయబోతున్నామన్న సంకేతాలను పవన్ కల్యాణ్ పంపినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేసినా.. ఆయన తనకు చాన్స్ ఇవ్వాలని ప్రజలను అడుగుతున్నారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటనపై పోరాటం వల్ల తనకు .. జనసేనకు రాష్ట్ర వ్యాప్త మైలేజ్ వచ్చిందన్న అభిప్రాయం పవన్ కల్యాణ్‌లో ఉందని అంటున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసైన వైపు చూస్తారని.. అవకాశం ఇస్తారని భావిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన బీజేపీ ప్రస్తావన కూడా తీసుకు రావడం లేదు. తానే సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పొత్తుల గురించి మాట్లాడటం లేదు. గతంలో చంద్రబాబునాయుడు విశాఖ ఘటనపై సంఘిభావం తెలిపినప్పుడు వైసీపీ సర్కార్‌ను కూలదోయడం కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. అప్పుడు కూడా కలిసి పోటీ చేయడంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు కానీ ఏపీ బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం.. వ్యూహం మార్చుకుంటున్నానని చెప్పడం ద్వారా పవన్ విధానంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ సినిమాలను పూర్తి స్థాయిలో వదిలేయలేరు. అది తన వృత్తి అని పార్టీని నడపడానికైనా సినిమాలు చేయాలని ఆయనంటున్నారు. అదే సమయంలో జనసేన రాజకీయ పయనం కూడా అలాగే ఉంది. ఇన్నేళ్లైనా పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా లే్కపోతే.. వైసీపీ ఓటమి కోసం పని చేయాలా అన్నదానిపైనా క్లారిటీ లేదు . ప్రస్తుతం పొత్తులో ఉన్న బీజేపీతో అయినా కలిసి ఉండాలా లేదా అన్నదానిపైనా క్లారిటీ ఉన్నట్లుగా లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో జనసేనతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పొత్తులు వద్దని.. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వ కావాలని ప్రజలు కోరుకుంటే గెలిపిస్తారు.. లేకపోతే లేదని కొంత మంది వాదిస్తున్నారు. ఈ కారణంగా ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారాలు చివరి వరకూ తెగెలా కనిపించడం లేదు.