YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రెండున్నర ఏళ్లలో పూర్తికానున్న బందరు పోర్టు

రెండున్నర ఏళ్లలో పూర్తికానున్న బందరు పోర్టు

విజయవాడ, నవంబర్ 16, 
బందరు పోర్టు నిర్మాణం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. తాజాగా పోర్టు నిర్మాణానికి ఎపి మారిటైం బోర్డుతో మెగా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. దీంతో ఒకటి, రెండు నెలల్లోనే పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ దిశలోకసరత్తు వేగంగా జరుగుతోంది. నవయుగ సంస్థతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం, దీనిపై జరిగిన న్యాయ వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం తదితర పరిణామలు తెలిసిందే. మెగాతో ఒప్పందం ఖరారు కావడంతో పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎపిసిజడ్‌ఎంఎ) ఇటీవల పరిశీలించింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతుల కోసం మారిటైం బోర్డు కసరత్తు చేస్తోంది. పర్యావరణ ప్రభావ అంచనాపై ఎపి కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. మత్స్యకారుల జీవనోపాధికి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో, నవంబర్‌ నెలాఖరులోపు కేంద్రం అనుమతులు లభిస్తాయని మారిటైం బోర్డు అధికారులు చెప్తున్నారు. అనంతరం భూమి పూజ చేసి పనులు ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నాయి. బ్యాంకు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి మారిటైం బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది.మొదటి దశలో పోర్టుకు సంబంధించి నాలుగు బెర్తులు నిర్మించాల్సి ఉంది. ఇందుకుగానూ ఎపి మారిటైం బోర్డు రూ.5,155.73 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. రూ.3,668.83 కోట్లతో మెగా ఇంజినీరింగ్‌ సంస్థ టెండరు దాఖలు చేసి ఎల్‌ వన్‌గా నిలిచింది. ఈ సంస్థతో మారిటైం బోర్డు ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. కేంద్ర పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాత కాంట్రాక్టు సంస్థకు డేట్‌ ఆఫ్‌ కమెన్స్‌మెంట్‌ (నిర్మాణ కాల పరిమితి)పై లెటర్‌ను మారిటైం బోర్డు ఇవ్వనుంది. ఒప్పందం ప్రకారం భూమి పూజ తర్వాత 30 నెలల వ్యవధిలో కాంట్రాక్టు సంస్థ నిర్మాణం పూర్తి చేయాలి.బందరు పోర్టు నిర్మాణం ఎన్నో మలుపులు తిరుగుతోంది. పోర్టు నిర్మాణం పూర్తయితే వ్యవసాయ రంగానికే పరిమితమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలో పారిశ్రామికావృద్ధికీ అవకాశాలు ఏర్పడతాయని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2008లో పోర్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్న మైటాస్‌ సంస్థ రూ.100 కోట్లకుపైగా బ్యాంకు రుణాలు తీసుకుంది. నిర్మాణ పనులు ప్రారంభించకుం డానే ఆర్థికంగా మునిగిపోయింది. ఆ తర్వాత పిపిపి పద్ధతిలో నిర్మాణానికి నవయుగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం కొద్ది రోజులకే ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. తాజాగా ఇపిసి పద్ధతిలో నిర్మాణానికి మారిటైం బోర్డు ద్వారా టెండర్లు ఆహ్వానించింది. మెగా ఇంజినీరింగ్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది.

Related Posts