కడప, నవంబర్ 16,
కడప జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. పులివెందుల లాంటి నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ కుటుంబీకులకు పెద్దపీట వేస్తారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓటుబ్యాంకు వైసీపీవైపు మళ్లించింది. 2014, 2019 ఎన్నికల్లో తన దూకుడును వైసీపీ ప్రదర్శించింది.2014లో టీడీపీ రాజంపేటను దక్కించుకోగలిగింది. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.2019 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు పలువురు బీజేపీ చెంతకు చేరారు. సీఎం రమేష్, ఆది నారాయణరెడ్డి వంటివారు బీజేపీలో ఉన్నారు. తాజాగా కడప జిల్లాపై చేయించిన సర్వేలో అధికార పార్టీపై వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోందని చంద్రబాబు పార్టీ నాయకులకు తెలిపారు. రాజంపేట, రైల్వేకోడూరు, కడప, బద్వేలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం చూపిస్తోందని, రానున్న ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లు పార్టీ ఖాతాలో పడాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు.బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో డాక్టర్ సుధ విజయం సాధించారు. తన భర్త మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీచేసి గెలుపొందారు. అయితే ఆమె ప్రజలకు చేరువకాలేకపోతోందని టీడీపీ సర్వేలో తేలింది. ప్రభుత్వంలోని కొందరు కీలక నాయకులు చెప్పిందే జరుగుతోందని, ఈ పరిణామాలన్నీ టీడీపీకి కలిసివస్తాయని చంద్రబాబు నేతలకు సూచించారు. కడప నియోజకవర్గమంటేనే కాంగ్రెస్ కు, ఆ తర్వాత వైసీపీకి పెట్టని కోట. అయితే ఇక్కడ రెండుసార్లు గెలిచిన అంజాద్ బాషా మంత్రి పదవి దక్కించుకున్నప్పటికీ ఆయన వైసీపీ ఆశించిన రీతిలో పనిచేయలేకపోతున్నారని ఆ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది తెలుగుదేశంకు సానుకూలంగా మారుతోందని చంద్రబాబు విశ్లేషించారు.జిల్లాలను ఏర్పాటు చేయడానికి ముందే రాజంపేటలో వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చాలంటూ ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అది పార్టీకి వ్యతిరేకంగా మారింది. తమ అభ్యర్థిని గెలిపిస్తే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని టీడీపీ ప్రకటించడంతో అక్కడ అనుకూల వాతావరణం ఏర్పడిందని విశ్లేషించారు. రైల్వేకోడూరు ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ తరఫున గెలిచిన కొరుముట్ల శ్రీనివాస్ పై అక్కడిప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, మంత్రి పదవి ఆశించినప్పటికీ అది దక్కకపోవడంతో ఆయన కూడా నియోజకవర్గంలో చురుగ్గా పర్యటించడంలేదు. ఇవన్నీ పార్టీకి ప్లస్సవుతాయని చెప్పారు. మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ వరుస పరాజయాలు చవిచూస్తున్నప్పటికీ పార్టీలోకి డీఎల్ రవీంద్రారెడ్డిని తీసుకొని టికెట్ ఇచ్చే విషయమై సర్వే నిర్వహించగా మెజారిటీ ప్రజలు డీఎల్ కు జై కొట్టారు. ఈ విషయం పార్టీకి సానుకూలంగా మారిందన్నారు. రానున్న ఎన్నికల్లో గట్టి పట్టును సంపాదించి వ్యూహాత్మకంగా చక్రం తిప్పాలని బాబు నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.