ముంబై, నవంబర్ 22,
దేశంలోని ప్రతి పౌరుడిని ఉలిక్కిపడేలా చేసింది ఓ పేరు. ఆమె హత్య జరిగిన విధానం.. కనీసం దహనసంస్కారాలకు కూడా నోచుకోకుండా ఎక్కడెక్కడో పడిసేన శరీరాభాగాలు.. ఆమె మర్డర్ కేసు అందరి హృదయాలను కదిలించింది. రోజుకో ట్విస్ట్ భయటపడుతుండడంతో సామాన్యులే కాదు.. పోలీసులు సైతం షాక్ అవుతున్నారు. ప్రియుడి ముసుగులో ఉన్న నరరూప రాక్షసుడి చేతిలో బలైన ఆ అమ్మాయి పేరే శ్రద్దా వాకర్. ప్రేమించింది.. అతడితో పూర్తి జీవితం ఊహించుకుంది.. కన్నవాళ్లు వద్దని వారిస్తే ప్రేమికుడి కోసం కుటుంబాన్నే వదిలేసింది. గత సంవత్సర కాలంగా తల్లిదండ్రులతో మాట్లాడుకుండా.. అతడిని పూర్తిగా నమ్మి.. ఆ మృగాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. చివరకు కూతురి కోసం కన్నతండ్రి ఇచ్చి ఫిర్యాదుతో ఆమె హత్యోదంతం బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధావాకర్ హత్య కేసు ఇప్పుడు వెండితెరపైకి రాబోతుంది. ఈ కేసును సినిమాగా తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ డైరెక్టర్ మనీష్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని అన్నారు.శ్రద్ధా వాకర్ హత్య కేసుపై సినిమా తీస్తున్నట్లు నిర్మాత-దర్శకుడు మనీష్ ఎఫ్ సింగ్ ముంబైలో ప్రకటించారు. తాను తెరకెక్కించే సినిమా అఫ్తాబ్ తన ప్రేయసి శ్రద్దా వాకర్ హత్య నుంచి ప్రేరణ పొందిందని.. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ పై పనిచేయడం స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ప్రేమ, పెళ్లి అంటూ అబ్బాయిలను నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న అమ్మాయిలు.. వారికి లైఫ్ లేకుండా చేస్తున్న ప్రేమపిశాచాల గురించి ఈ సినిమాలో బయటపెడతానని అన్నారు. బృందావన్ ఫిల్మ్స్ పతాకంపై మనీష్ ఎఫ్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఢిల్లీ చుట్టూ ఉన్న అడవుల వీడియో క్లిప్‌లను పరిశోధించి వాటిని సేకరించే పనిని ప్రారంభించారు అతని టీమ్. షూటింగ్ కోసం లొకేషన్ కూడా వెతుకుతున్నారు.ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు సినిమా స్క్రిప్ట్ ఖరారు చేయబడదని తెలిపారు. ఛార్జ్ షీట్ మాత్రమే తమకు పూర్తి వివరాలు ఇవ్వగలదని అన్నారు. తన సినిమా పూర్తిగా శ్రద్ధా హత్య కేసు ఆధారంగా ఉండదని, దాని నుండి ప్రేరణ పొందుతుందని చెప్పారు. త్వరలోనే నటీనటులను అనౌన్స్ చేస్తామన్నారు.