సూపర్‌స్టార్ మహేశ్ బాబు 24వ సినిమాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ ఆడియోను విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేసింది. దీంతో వరుసగా రెండు ట్రీట్లతో మహేశ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ సీఎంగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొరటాల, మహేశ్ కాంబోలో వచ్చిన 'శ్రీమంతుడు' భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ మూవీపై టాలీవుడ్‌లో అంతకుమించిన అంచనాలు ఉన్నాయి.
. ఈ మూవీలో మహేశ్ సీఎంగా కనిపించబోతుండగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అతడు ప్రమాణ స్వీకారం చేసే ఆడియో క్లిప్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో "భరత్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని.. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తానని.. భయంగా గానీ పక్షపాతంగా గానీ రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అంటూ తన ప్రమాణ స్వీకారాన్ని చేశాడు.
పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటుండగా.. ఇందులో మహేశ్ సరసన కైరా అద్వాణి నటిస్తోంది. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, సితార తదితరులు ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.