తిరుపతి, డిసెంబర్ 9,
ధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ.. ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్ ఉందన్నట్టు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ, జనసేన విషయం ఎలా ఉన్నా.. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపుతున్నాయి. అటు వరుస సమావేశాలు నిర్వహిస్తూ జగన్.. ప్రజల్లో ఉంటూ చంద్రబాబు ఎన్నికలకు రెడీ అవుతున్నారు. ప్రజలను ఆకర్షించే నినాదాలు ఇస్తూ.. ఎలక్షనీరింగ్ మొదలుపెట్టారు. ఈ సమయంలో.. అధికార వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చింతంగా 175 స్థానాల్లో విజయం సాధిస్తాం. వాటిలో ముందు కుప్పం నియోజకవర్గమే ఉంటుంది. కుప్పంలోనే గెలిచాక.. మిగతా నియోజకవర్గాల్లో ఏముంది. ఇన్నాళ్లు కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏదో చేస్తారని అక్కడి ప్రజలు ఆశపడ్డారు. కానీ చంద్రబాబుతో ఏమీ జరగబోదని ప్రజలకు అర్థం అయ్యింది. అందుకే ప్రజలు కూడా చంద్రబాబును ఓడించాలని డిసైడ్ అయ్యారు. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది' అని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.అటు తెలుగుదేశం పార్టీ కూడా కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. చంద్రబాబు మళ్లీ కుప్పం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు లోకేశ్ కూడా మళ్లీ మంగళగిరి నియోజకవర్గంలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారట. అయితే.. చంద్రబాబును కుప్పంలోనే కాకుండా.. మరో నియోజకవర్గంలోనూ పోటీ చేయాలని కొందరు పార్టీ నేతలు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. కుప్పంపై జగన్ ఫుల్ ఫోకస్ పెట్టడంతో.. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే.. మేలు అనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం.చంద్రబాబు ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. నిజంగానే కుప్పం సహా.. మరో నియోజకవర్గంలో పోటీ చేస్తే.. అధికార పార్టీకి భయపడినట్టు అవుతుందని.. తద్వారా.. పార్టీ నేతలు, కార్యకర్తలు డీలా పడతారని చంద్రబాబు అన్నట్టు సమాచారం. అందుకే.. పార్టీ తరఫున కేడర్‌ను సమాయత్తం చేసి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగా కాకుండా.. కచ్చితంగా గెలిచేలా పనిచేయాలని చంద్రబాబు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. అటు.. ఇతర నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. దీంతో కుప్పంపై అందరి దృష్టి పడింది. అటు రెండు పార్టీలు మిషన్ కుప్పం అంటూ హీట్ పెంచుతున్నాయి.