YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఈ విద్యాసంవత్సరం నుంచే బయోమెట్రిక్‌

ఈ విద్యాసంవత్సరం నుంచే బయోమెట్రిక్‌

త్వరలోనే ప్రారంభంకానున్న విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి రానుంది. గతేడాదే దీనిపై కేంద్రం నుంచి అనుమతి రాగా సర్వశిక్షా అభియాన్‌ నుంచి నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే అమల్లోకి రాలేదు. ఈ ఏడాది కచ్చితంగా అమలుచేసేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బడుల్లో విద్యుత్తు సౌకర్యం, బిల్లుల బకాయిల వివరాలు పంపాలని ఆదేశాలు జారీచేసింది. డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులతోపాటు మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్య, పాఠశాలలకు వచ్చే నిధుల్లో కచ్చితత్వం తేల్చాలని విద్యా విభాగం చర్యలు ప్రారంభించింది. ఇదిలాఉంటే జోగులాంబ జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల్లోని పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదు. దూరంగా ఉన్న పట్టణాలు, నగరాల్లో నివసిస్తూ.. పల్లెల్లో పనిచేస్తున్న వారిలో పలువురు పాఠశాలలకు ఆలస్యంగా రావడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లేట్ గా రావడమే కాకుండా బడుల్లో పూర్తి సమయం ఉండడంలేదు. సమయాని కంటే ముందుగానే వెళ్లిపోవడం, అనుమతి లేకుండానే గైర్హాజరు అవుతున్నారని స్థానికులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. 

 

ఉపాధ్యాయుల హాజరు సరిగాలేకపోవడం ఓ సమస్య అయితే.. విద్యార్థుల హాజరుకు, వాస్త పరిస్థితికి పొంతన కూడా ఉండకపోవడం మరో సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో పాఠశాల వ్యవస్థను గాడిన పెట్టేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్కూళ్లలో బయోమెట్రిక్‌కు అవసరమైన విద్యుత్తు సౌకర్యంపై దృష్టి సారించింది. మండల స్థాయిలో ఎంఈవోలు, మండల సమన్వయకర్తలు, డాటా ఆపరేటర్లు, ప్రధానోపాధ్యాయుల సహకారంతో వివిధ అంశాల పరిశీలన కార్యక్రమం మొదలైంది. బడుల్లో విద్యుత్తు కనెక్షన్‌ ఉందా? మీటరు సంఖ్య ఎంత? ప్రస్తుతం విద్యుత్తు బిల్లు బకాయిలు ఏ మేరకు ఉన్నాయి? లాంటి వివరాలు ఇవ్వాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. దీంతో ఇటీవలే వారు నివేదికలు కూడా పంపించారు. త్వరలో ఓ కంపెనీ ప్రతినిధులు వచ్చి పాఠశాలల్లో బయోమెట్రిక్‌కు అవసరమైన సిగ్నల్‌ సమస్యను పరిశీలించనున్నారని సమాచారం. సర్కారీ స్కూళ్ల స్థితిగతులు మెరుగుపరచేందుకు ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలపై జిల్లావాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts