బెంగళూరు, డిసెంబర్ 10,
గుజరాత్ ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. ఇదంతా ముగిసిన కథ. ఇప్పుడు అసలు కథ ఉంది. అదే...కర్ణాటక ఎన్నికలు. మరో ఐదు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు రానున్నాయి. ఇదే జోరుతో అక్కడా క్లీన్ స్వీప్ చేస్తామని కర్ణాటక బీజేపీ ధీమాగా చెబుతోంది. కానీ... గుజరాత్, కర్ణాటకను పోల్చి చూస్తే...గుజరాత్ ఫలితాలే కర్ణాటకలోనూ రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. గుజరాత్‌లో బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందంటే అందుకు కారణం..మోడీ చరిష్మా. అందులోనూ అది ఆయన సొంత రాష్ట్రం కాబట్టి కొంత వరకూ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయి ఉండొచ్చు. కారణాలేవైనా..బీజేపీకి అయితే భారీ మెజార్టీ వచ్చింది. కానీ...కర్ణాటక పరిస్థితి వేరు. ఆ రాష్ట్రంలో క్యాడర్ బలంగా ఏం లేదు. పైగా...అంతకు ముందు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది. ఇప్పుడూ ఆ పార్టీ ఉనికి అక్కడ బాగానే కనిపిస్తోంది. కాస్త అటు ఇటు అయితే...తప్పకుండా కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే...ఇక్కడే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను ఓ సారి గుర్తు చేసుకోవాలి. సాధారణంగా...కొన్ని రాష్ట్రాల్లో ఓటర్లు ప్రతి ఐదేళ్లకోసారి కొత్త ప్రభుత్వానికి అవకాశంఇస్తుంటారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ...హిమాచల్ ఓటర్లు అధికారంలో ఉన్న బీజేపీని కాదని...కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఇది కచ్చితంగా బీజేపీని వేవ్‌ను అడ్డుకున్న విజయమే. గుజరాత్‌గెలుపుతో క్యాడర్ హ్యాపీగానే ఉన్నా...హిమాచల్‌ను చేజార్చుకోవడం వల్ల ఆత్మ పరిశీలనలో పడింది బీజేపీ. ఇదే ట్రెండ్ కర్ణాటకలోనూ కొనసాగితే...అధికారం కోల్పోక తప్పదన్న కలవరం మొదలైంది. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కర్ణాటకలోనూ గుజరాత్ ఫలితాలు రిపీట్ అవుతాయని చాలా ధీమాగా చెబుతున్నారు. కానీ...హిమాచల్‌లో జైరామ్ ఠాకూర్‌ను ప్రజలు ఎలాగైతే పక్కన పెట్టారో..అలాగే బొమ్మై సర్కార్‌ను కూడా పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఓ సారి కర్ణాటక ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ని గమనిస్తే...2004 నుంచి అక్కడి ఓటర్లు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. 2008లో బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ 110 స్థానాలు గెలుచుకుంది. ఆ తరవాత..."ఆపరేషన్ లోటస్" మొదలు పెట్టి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంది. మ్యాజిక్ ఫిగర్ సాధించుకుంది. ఆ తరవాత 2013లో మాత్రం బీజేపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఎన్నికల్లో 40 సీట్లకే పరిమితమైంది కాషాయ పార్టీ. ఓటు షేర్ కూడా దారుణంగా పడిపోయింది. కాంగ్రెస్ 122స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018లో మళ్లీ సీన్ మారింది. కాంగ్రెస్‌ను కాదనుకుని ఓటర్లు బీజేపీకి ఓటు వేశారు. కాంగ్రెస్ 80 స్థానాలకుపరిమితం కాగా...బీజేపీ 104 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ జేడీఎస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిప్పటికీ...ఆపరేషన్ లోటస్ ధాటికి ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఫలితంగా...బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ ట్రెండ్ కొనసాగితే...ఈ సారి ఓటర్లు కాంగ్రెస్‌కు అవకాశమిస్తారేమో అన్న అంచనాలున్నాయి. సీనియర్ నేత అయిన యడియూరప్పను పక్కన పెట్టేసింది బీజేపీ. కర్ణాటకలో కీలకమైన లింగాయత్ వర్గానికి చెందిన యడ్డీని పక్కకు తప్పించడం వల్ల ఆ మేరకు బీజేపీ నష్టపోవాల్సి వచ్చింది. లింగాయత్ ఓటు బ్యాంకుని దూరం చేసుకున్నట్టైంది. పైగా...బొమ్మై సర్కార్ "పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది" అన్న విమర్శలూ ఉన్నాయి. అవినీతి ఆరోపణలు రావడం, పరిపాలన సజావుగా సాగకపోవడం లాంటి కారణాలూ బొమ్మై ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేసే అవకాశముంది. సో...బీజేపీ కర్ణాటకలో ఆపరేషన్ లోటస్‌ను అమలు చేస్తే తప్ప భారీ మెజార్టీతో గెలవకపోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.