శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఇటీవల వెలుగుచూసిన అర్చక వివాదం రాజకీయ రంగును పులుముకుంది. దీంతో భక్తుల్లో తీవ్ర ఆవేదన వెల్లువెత్తుతోంది. భగవంతుడిని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని, తిరుమల పవిత్రతను కాపాడాలని అంతా కోరుతున్నారు. ఇదిలాఉంటే శ్రీవారి సన్నిధిలో అపసవ్య విధానాలు కొనసాగుతున్నాయంటూ ఇటీవలిగా విమర్శలు గుప్పిస్తున్న అర్చకులు రమణ దీక్షితులు ఏమాత్రం వెనక్కితగ్గడంలేదు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని అంటున్నారు. శ్రీవారి సన్నిధిలో నియమాలకు విరుద్ధ కార్యకలాపాలు సాగుతున్నాయంతూ రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే.. ఆయన ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి మాటేదీ పైకి రాలేదు. ఇటీవల అర్చకుల పదవీ విరమణపై టీటీడీ నిర్ణయం తీసుకోవడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే.. ప్రస్తుతం ఆయన ఆరోపణల పర్వం ప్రారంభించారని పలువురు విమర్శిస్తున్నారు.
పదవీ విరమణ నిబంధనలపై పాలక మండలి ఆరు నెలల నుంచే కసరత్తు చేస్తున్న సంగతి తమకు తెలుసునని రమణదీక్షితులు పేర్కొన్నారు. అంటే పదవి పోతుందనే విషయం తెలిసే ఇప్పుడు ఆరోపణలకు దిగారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆభరణాల అదృశ్యం విషయానికి వస్తే, ప్రధాన అర్చకులుగా ఉండి ఆయన ఏంచేశారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సమక్షంలోనే.. అదీ మూలవిరాట్టుకు సంబంధించిన అభరణాలు మాయమైపోతుంటే ఇన్నేళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే రమణ దీక్షితులు మాత్రం తన స్వామివారి సేవే ప్రధానాంశమని అంటున్నారు. తన జీవితం వెంకన్న స్వామి సేవకే అంకితం చేశానని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత వివాదంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇలా వేంకటేశ్వరుడి సన్నిధికి చెందిన అంశాలు రచ్చకెక్కడం.. అందులోనూ రాజకీయమవడంపై సర్వత్రా ఆవేదన వెల్లువెత్తుతోంది.