YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుఫాను నష్టం అంతా ఇంతా కాదు

తుఫాను నష్టం అంతా ఇంతా కాదు

తిరుపతి, డిసెంబర్ 12, 
బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండూస్‌ తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ పంట కాస్త ప్రకృతి వైఫరీతాల్యనుంచి గట్టెక్కిందనుకుంటున్న క్రమంలో తుపాను ప్రభావంతో అకస్మాత్తుగా వచ్చిపడ్డ అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో కేవలం 30 శాతం మాత్రమే వరి పంటకు సంబందించి కోతలు పూర్తయ్యాయి.. మరో 20 శాతం చేలల్లో వరి పనలుగాను, గట్టుమీద కల్లాల్లో రాసులుగాను చాలా వరకు పంట ఉండిపోయింది. ఇక 50 శాతం వరకు కోతలు ఇంకా ప్రారంభించనేలేదు.. కోతలు ప్రారంభించని రైతులు వరకు పరవాలేదుకానీ కల్లాల్లోను, చేలల్లోనూ ఉండిపోయిన పంటకు సంబందించి రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు ఒబ్బిడి చేసుకున్న ధాన్యాన్ని బరకాల సాయంతో కప్పెట్టుకుని వర్షాలనుంచి పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేశారు రైతులు. అయితే చేలల్లో పనల రూపంలో ఉండిపోయిన పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో శుక్రవారం మద్యాహ్నం నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తునే ఉంది. పలు తీర గ్రామాల్లో అయితే భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు కమతాల్లోని వరి చేలన్నీ ముంపుకు గురవుతున్నాయ. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తీర గ్రామాల్లో మాండూస్‌ తుపాను ప్రభావంతో ఓ పక్క వర్షాలు కురుస్తుండగా తీరం వెంబడి ఈదురుగాలుల ప్రభావంతో చలిగాలులు బాగా పెరిగాయి.. దీంతో చలిగాలుల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ఎడతెరిపి లేని వర్షాలు మరో పక్క చలిగాలులు ప్రజలు బయటకు వెళ్లేందకు భయపడే పరిస్థితి కనిపిస్తోంది.కాకినాడ ఉప్పాడ బీచ్‌ రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మాండూస్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడిసముద్రపు అలలు ఉవ్వెత్తున లేచి పడుతుండడంతో అలలు రోడ్డుమీదకు వస్తున్నాయి. దీంతో ఇది ప్రమాదకరంగా మారడంతో కాకినాడాఉప్పాడ రోడ్డును తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు. దీంతో రోడ్డుపై బండరాళ్లు అడ్డుగా వేయించి వాహనాల రాకపోకలను నిలిపివేయించారు తిమ్మాపురం పోలీసులు. ఇదిలా ఉంటే నేమాం అనే ప్రాంతం వద్ద అలల ఉద్ధృతికి తీరం కోతకు గురైంది.బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండస్‌ గత అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెరువులు అలుగులు దాటి పారుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరం ఉన్నవారిని అక్కడికి తరలిస్తున్నారు.
సోమశిల గేట్లు ఎత్తివేత..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్నాకు నీరు ఎక్కువగా వస్తోంది. దీంతో సోమశిల నిండుకుండలా మారింది. పూర్తి నీటిమట్టం 72టీఎంసీలు కాగా ప్రస్తుతం సోమశిలలో 69టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఆరు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. పెన్నాకు వరదనీరు భారీగా విడుదల చేస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.నెల్లూరు జిల్లాతోపాటు, దక్షిణ కోస్తాలో కూడా పంటనష్టం అధికంగా కనపడుతోంది. ప్రస్తుతం ఇక్కడ వరినాట్ల దశలో ఉంది. అటు బాపట్ల, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం వరికోతల దశలో ఉంది. కొంతమంది వడ్లను కళ్లాల్లోనే ఉంచారు. రోడ్లపై ఆరబోశారు. వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దక్షిణ కోస్తాపై తుపాను ప్రభావం ఊహించినదానికంటే ఎక్కువగానే కనపడుతోంది. తుపాను తీరం దాటే సమయంలో పెద్దగా వర్షాలు లేవు కానీ, తీరం దాటిన తర్వాత మాత్రం వానలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా చలిగాలులు పెరిగాయి. బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతు న్నారు. అటు రాయలసీమలో కూడా వర్షాలు పడుతున్నాయి. శనివారం పూర్తిగా వర్షాలు పడతాయని అంచనా. అటు ఆదివారం కూడా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.వైసీపీ నేతల గడప గడప కార్యక్రమాలకు తుపాను అడ్డుపడింది. నాయకులంతా తుపాను కారణంగా గడప గడప వాయిదా వేసుకున్నారు. టీడీపీ నేతల ఇదేం ఖర్మ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం నాయకులంతా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో కలసి వారు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

Related Posts