సిమ్లా, డిసెంబర్ 12,
పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన కాంగ్రెస్‌కు కాస్త ఉత్సాహాన్నిచ్చాయి...హిమాచల్ ఎన్నికల ఫలితాలు. ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ సహా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఎన్నికలు జరిగిన ప్రతి చోటా ఉనికి కోల్పోతూ వస్తున్న పార్టీకి కొత్త బలమొచ్చింది. హిమాచల్‌లో కాంగ్రెస్ గెలవటానికి కారణాలేంటని అనలైజ్ చేస్తే...ముందుగా ప్రియాంక గాంధీ పేరే వినిపిస్తోంది. సుఖ్వీందర్ సింగ్‌ను సీఎం చేయాలన్న ఆలోచన కూడా ప్రియాంక గాంధీదే అని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో చాలా యాక్టివ్‌గా ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. ఫలితాలు వచ్చిన వెంటనే అంతే యాక్టివ్‌గా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన వ్యూహాలను రెడీ చేసుకున్నారు. అందరి ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ...అందరి అభిప్రాయాలనూ గౌరవిస్తూనే సుఖ్వీందర్‌ను సీఎం చేశారామె.నిజానికి 2019 నుంచే ప్రియాంక గాంధీ..కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్ అన్న పేరు తెచ్చుకున్నారు. రాజస్థాన్‌లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌ను మళ్లీ ఒప్పించి పార్టీలోకి రప్పించడం సహా...పంజాబ్‌లో కేప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించడం వరకూ కీలక నిర్ణయాలన్నీ ఆమే తీసుకున్నారు. అంతే కాదు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల విషయంలోనూ చొరవ చూపించారు. ఖర్గేను ఎన్నుకోవడంలో ఆసక్తి కనబరిచారు. ఈ అధ్యక్ష రేసులో అశోక్ గహ్లోట్ పేరు కూడా వినిపించింది. అయితే...నాటకీయ పరిణామాల తరవాత ఆయన తప్పుకున్నారు. ఆ తరవాత సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రేసులోకి వచ్చారు. కానీ...ఆయన నామినేషన్ వేయలేదు. ఫలితంగా...శశి థరూర్, ఖర్గే మధ్య పోటీ నెలకొంది. నామినేషన్ వేసే ముందు రోజు రాత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ దాదాపు 2 గంటల పాటు ఏకాంతంగా చర్చించుకున్నారట. ప్రియాంకకు చెందిన ఓ ప్రైవేట్ రెసిడెన్సీలో ఈ మీటింగ్ పెట్టుకున్నారని సమాచారం. ఈ సమావేశం తరవాతే..ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. ఆయన అధ్యక్ష ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కనుక.. ఖర్గే ఆ పదవిని చేపట్టారు. ఇక రాజస్థాన్‌లో సచిన్ పైలట్ 20 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అధిష్ఠానానికి ఎదురు తిరిగారు. ఎమ్మెల్యేలతో కలిసి హరియాణాకు వెళ్లిపోయారు. అశోక్ గహ్లోట్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అహ్మద్ పటేల్, ప్రియాంక గాంధీ ఒక్కటై ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఎప్పుడైతే ప్రియాంక గాంధీ మంతనాలు మొదలు పెట్టారో అప్పటి నుంచి పైలట్ వర్గం అంతా చల్లబడింది. కొన్ని డిమాండ్‌ల నెరవేర్చేందుకు అంగీకరించి చివరకు...గహ్లోట్, పైలట్‌ను కలిపి ప్రభుత్వం కూలిపోకుండా జాగ్రత్తపడ్డారు ప్రియాంక గాంధీ. పంజాబ్ విషయంలోనూ ఇంతే. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం కేప్టెన్ అమరీందర్ సింగ్‌కు ఎదురు నిలిచారు. ఆ సమయం లోనే ప్రియాంక గాంధీ ఎంటర్ అయ్యారు. అమరీందర్ సింగ్ సీఎం పదవిని వదులుకోడానికి ఇష్టపడకపోయినా...మాట్లాడి ఒప్పించి తప్పించారు. ఆ తరవాత అధిష్ఠానంపై మరింత ఒత్తిడి పెరిగింది. నెక్ట్స్ సీఎం ఎవరు అన్న ఉత్కంఠకు తెర దించుతూ దళితుడైన చన్నీని సీఎం పదవికి ఎంపిక చేశారు ప్రియాంక. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇప్పుడు హిమాచల్‌లోనూ ప్రతిభా సింగ్‌ను సీఎం చేస్తారని అంతా అనుకున్నా...ప్రియాంక గాంధీ రాకతో ఆ పరిణామాలన్నీ మారిపోయాయి. సుఖ్వీందర్ సింగ్‌ను సీఎం కుర్చీలోకూర్చోబెట్టి...అగ్నిహోత్రిక డిప్యుటీ సీఎం ఇచ్చారు. ఈ రకంగా...ఠాకూర్, బ్రాహ్మణ వర్గాలకు సమ ప్రాధాన్యం ఉండేలా జాగ్రత్తపడ్డారు ప్రియాంక. ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా...ఆయన టీంలో ఎవరెవరు ఉంటారన్నది ఇప్పటి వరకూ తేలలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ...ప్రస్తుతం పార్టీలో సీనియర్లు. ఇక మిగిలింది..ప్రియాంక గాంధీ మాత్రమే. ఆమెకు కచ్చితంగా ఖర్గే టీంలో మంచి పొజిషన్ దక్కుతుందని అంటున్నారు విశ్లేషకులు.