YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జాతీయ పార్టీ గుర్తింపు సాధ్యమేనా

జాతీయ పార్టీ  గుర్తింపు సాధ్యమేనా

హైదరాబాద్, డిసెంబర్ 12, 
నిన్నటి వరకూ తెలంగాణకు మాత్రమే పరిమితమైన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. అన్ని అడ్డంకులు పూర్తి చేసుకుని జెండాను కూడా ఆర్భాటంగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభించారు. ఎప్పటిలాగానే అదే కుమారస్వామి, ప్రకాష్ రాజ్ లు చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. ఎప్పుడూ వచ్చే వారే. కొత్త వారేరీ అనే ప్రశ్న మాత్రం వేయకండి. ఎందుకంటే సమయం లేకనే ఎక్కువ మంది నేతలను పిలవలేదని, పొరుగున ఉన్నారు కనుక పరుగులు పెట్టి వస్తారని ఆహ్వానించామని టీఆర్ఎస్ నేతలు ముందుగానే మీడియాకు చెప్పుకుని కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. తెలంగాణలో ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత దేశాన్ని ఏలాలన్న లక్ష్యంతో కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు. అందులో తప్పులేదు. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. జాతీయ పార్టీగా అవతరించాలంటే నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించాలి. అప్పడే జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్ గుర్తిస్తుంది. బీఎస్పీ వంటి పార్టీలకే జాతీయ పార్టీ హోదా లేదు. తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీగా తనకు తాను ప్రకటించుకుంటుందే తప్ప ఎన్నికల కమిషన్ మాత్రం దానిని ప్రాంతీయ పార్టీగానే గుర్తిస్తుంది. టీడీపీ ఏపీలోనూ, తెలంగాణాలోనూ పోటీ చేసింది. 2018 ఎన్నికల్లోనూ పోటీ చేసింది. కానీ ఇతర రాష్ట్రాలకు మాత్రం ఆ పార్టీ విస్తరించలేకపోయింది. అయినా ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే. అయితే ఆయన తెలివిగా పార్టీ పేరును మాత్రం మార్చకుండా తనకు తానే జాతీయ పార్టీగా మార్చుకున్నారు.ఇక కేసీఆర్ అలా కాదు. మొండి మనిషి. ఏదైనా సాధించే వరకూ పోరాటం ఆపరన్న పేరుంది. అందుకే తెలంగాణ పేరు పార్టీలో ఉండటంతో ఆయన పేరు మార్చడం అనివార్యమయింది. టీఆర్ఎస్ ను పదమూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ గా మారింది. జెండా రంగు మారలేదు కాని అందులో తెలంగాణ రాష్ట్ర పటం బదులు దేశ మ్యాప్ ను పెట్టారు. మిగిలినదంతా సేమ్ టు సేమ్. అదే రంగు. అదే గుర్తు. తెలంగాణలో ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక ఆయన పార్టీ ఆవిర్భావం సందర్భంగా కర్ణాటకలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పోటీ చేయవచ్చు. జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని కనీసం ఒక ఇరవై స్థానాల్లో పోటీ చేసే వీలుంది. రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో పోటీ చేసే వీలుంటుంది.. ఆమ్ ఆద్మీ పార్టీ పదకొండేళ్ల తర్వాత జాతీయ పార్టీగా మారింది. అది తనంతట తాను జాతీయ పార్టీగా ప్రకటించుకోలేదు. ముందు ఢిల్లీలో మూడు సార్లు గెలిచింది. తర్వాత పొరుగున ఉన్న పంజాబ్ లో అధికారంలోకి వచ్చింది. తర్వాత గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ పోటీ చేసి జాతీయ పార్టీగా అవతరించింది. జాతీయ పార్టీ అని చెప్పుకోకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ గోవా, హర్యానా వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఎంతో కొంత ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేసుకుంది. పదకొండేళ్ల తర్వాత కాని దానికి ఎన్నికల కమిషన్ నుంచి జాతీయ హోదా లభించలేదన్న వి‍షయాన్ని గుర్తించాల్సి ఉంటుంది.  ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఏపీలో ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారా? లేదా? అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే అక్కడ పోటీ చేస్తే ఒంటరిగానే పోటీ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ బరిలోకి దిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎవరి ఈక్వేషన్లు వారికి ఉన్నాయి. బీజేపీకి కాంగ్రెస్ మినహా అక్కడ అన్నీ మిత్రపక్షాలే. ఆ ఛాన్స్ లేదు. ఒంటరిగా ఏపీలో పోటీ చేసి సీట్లు సాధించడం ఏపీలో అంత తేలిక కాదు. బీఆర్ఎస్ గా ఏపీ ప్రజలు చూడరు. రాష్ట్ర విభజన జరగడంతో ఏపీ ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే చూస్తారు. దక్షిణాదిలోనూ. తమిళనాడులోనూ అదే పరిస్థితి. అక్కడ కమల్ హాసన్ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి తప్పించి మిగిలిన డీఎంకే, అన్నాడీఎంకే తో కలిసే అవకాశాలు లేవు. ఒడిశాలోనూ ఏక్ నిరంజన్. నవీన్ పట్నాయక్ ఒంటరిగానే పోటీ చేస్తారు. బీఆర్ఎస్ అవసరం ఆయనకు లేదు. జాతీయ రాజకీయాలకే ఆయన దూరంగా ఉంటారు. కేరళలో ఎటూ వామపక్షాలు, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. అక్కడా పొత్తుకు ఛాన్స్ లేదు. ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు. మహారాష్ట్రలో మాత్రం కొంత సరిహద్దు ప్రాంతాల్లో పోటీ చేయడానికి అవకాశముంది. ఇక్కడా సింగిల్ డిజిట్... ఇప్పటికైతే కర్ణాటక, మహారాష్ట్రలో అతి కొద్ది స్థానాలు.. సింగిల్ డిజిట్ స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఎంఐఎంతో పాత్తు పెట్టుకుని దేశంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశమున్నా... దేని గుర్తులు దానివే. ఎవరి జెండా... అజెండా వారిదే.. అందుకే బీఆర్ఎస్ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమతం అవుతుందా? అన్న వాదన బలంగా వినిపిస్తుంది. కానీ కేసీఆర్ వ్యూహం.. ఆలోచనలను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదంటారు. ఎందుకంటే రాదని భావించిన తెలంగాణను సాధించిన నేత జాతీయ పార్టీగా సక్సెస్ చేస్తారన్న నమ్మకం నేతల్లోనూ, క్యాడర్ లోనూ ఉంది. అందుకు సమయం పట్టవచ్చు. ఎంత సమయం అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అంచనాకు కూడా అందని వ్యవహారం. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.

Related Posts