విజయవాడ, డిసెంబర్ 16,
గంటా, కన్నా, బోండా. వీరి పార్టీలు వేరు. కానీ వీరిలో కామన్ పాయింట్ కాపు సామాజికవర్గం. వీరు ముగ్గురు అర్ధరాత్రి వరకు చర్చలు జరపడమే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ అటెన్షన్‌ను క్రియేట్ చేస్తోంది. పైగా వీరి భేటీకి ముందు కన్నా లక్ష్మీనారాయణను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కలవడం మరింత ఆసక్తిగా మారింది. బీజేపీ నేత కన్నా, టీడీపీలో ఉన్న గంటా, బోండా ఉమ విజయవాడలో కలిశారు. అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ కలవని వీరు చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. ఈ నెల 26న రంగా వర్ధంతి రోజున విశాఖలో కాపు నాడు మహాసభ ఉంది. ఆ రోజు వివిధ పార్టీల్లోని కాపు నేతలంతా కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కన్నా, గంటా, బోండా భేటీ రాజకీయ ప్రాధాన్యతను పెంచేస్తోంది.వీరంతా కలిసి ఒకే జెండా కప్పుకుంటారా? లేదంటే కొత్త జెండాను ప్రకటిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదీ కాక గంటా, కన్నాను కలవడానికి ముందు జనసేన నేత నాదెండ్ల మనోహర్… లక్ష్మీనారాయణను కలవడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. ఇటీవల కాపు సీఎం నినాదాన్ని వినిపిస్తున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలు కీలకంగా మారాయి. కాపు నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించే వారికే తమ మద్దతు ఉంటుందనే ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.కానీ తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు గంటా శ్రీనివాసరావు. తమ భేటీలో రంగా వర్ధంతి కార్యక్రమం చర్చకే రాలేదన్నారు బోండా ఉమ. రాజకీయ చర్చే జరగలేదన్నారు. బుధవారం రాత్రి కన్నా కూడా ఇదే చెప్పారు. కేవలం డిన్నర్ కోసమే మీటింగ్ అయ్యామని చెప్పుకొచ్చారు. ఏమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.