గుంటూరు, డిసెంబర్ 16,
ఆంధ్రప్రదేశ్‌లో కాపు రాజకీయ నేతలు ఇటీవలి కాలంలో పార్టీలకు అతీతంగా సమావేశాలు నిర్వహిస్తూ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు మాత్రం ఇలా విడి సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆ పార్టీ కాపు నేతలు భేటీలు అవుతున్నారు. తాజాగా వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా విశాఖలో భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లుగా ఇప్పుడు ఏం జరిగినా రాజకీయం ఉంటుంది.. రాజకీయం లేదంటే.. అబద్దం చెప్పినట్లే. అందుకే కాపు నాయకులు ఇప్పుడు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ? ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్నది కీలకంగా మారింది. అన్ని పార్టీల్లోనూ కాపు సామాజికవర్గ నేతలు కీలకంగా ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లలేదు కానీ ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రభావితం చేయగలిగే స్థాయికి.. బలాన్ని కాపు నేతలు పొందారు. గత ప్రభుత్వంలో..ఈ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. అయితే వారికి ఎంత పవర్ ఉందనే విషయం పక్కన పెడితే.. వారిని రాజకీయంగా ప్రాధాన్యపరంగా పార్టీలు గుర్తిస్తున్నాయి. అయితే వారికి సీఎం పదవి అనేది ఇంకా అందడం లేదు. ఆ అసంతృప్తి ఉంది. ఇటీవలి కాలంలో కాపు నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య నిర్వహించిన రెండు సమావేశాలతో కాపు నేతలంతా కలిసి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకూ అది సాకారం కాలేదు. తాజాగా మరోసారి భేటీలు అవుతున్నారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా వీరంతా మరోసారి భేటీ కానున్నారు. అన్ని పార్టీల్లోని కాపు నేతలు.. సమావేశమవుతున్నారు. వారికి పార్టీల అడ్డంకులు రావడం లేదు. తమ పార్టీకి ఇబ్బంది లేకుండా.. కుల సంఘ సమావేశాలు.. నేతల భేటీల్లో పాల్గొంటున్నారు. అది సామాజికవర్గ సమావేశమే కానీ.. రాజకీయం కాదని సర్ది చెప్పుకుంటున్నారు. ఈ సమావేశాల పట్ల వారు ఉన్న పార్టీలు కూడా పెద్దగా ఆందోళన చెందడం లేదు. పార్టీకి వారు నిబద్ధులై ఉంటారని నమ్మకంతో ఉన్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలు మాత్రం..ఈ సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఆ పార్టీ కాపు నేతలంతా భేటీ అవుతూంటారు. అయితే ఈ సమావేశాలు ప్రధానంగా పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇవ్వడానికే పెడుతున్నారు. అందుకే.. వైఎస్ఆర్‌సీపీ కాపు నేతలపై ఆ సామాజికవర్గంలోనే విమర్శలు వస్తూ ఉంటాయి. కాపు నేతలంతా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందా అనే ఆలోచన కూడా గతంలో చేశారన్న ప్రచారం జరిగింది. కానీ కాపులు మాత్రమే ఓట్లు వేస్తే ఎవరూ గెలవరు. అందుకే విరమించుకుని ఉంటారు.కానీ ఆ సామాజికవర్గం నుంచి పవన్ కల్యాణ్ .. మాస్ లీడర్‌గా రాజకీయ బరిలో ఉన్నారు. అందరూ కలిసి ఆయనను సమర్థిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా వారికి వచ్చి ఉండవచ్చు. కానీ అది అంత తేలికగా సాధ్యమయ్యే విషయం కాదు. పవన్ కల్యాణ్ కూడా ఒక్క కాపులు ఓటు వేస్తేనే తాను సీఎం కాలేనని తెలుసు. అందరి మద్దతూ ఆయన కోరుకుంటారు. అదే సమయంలో కాపు నేతలు తమ రాజకీయ భవిష్యత్ ను కాదనుకుని.. పవన్ కు మద్దతు తెలుపడం కూడా కష్టమే. కాపు నేతలు సమావేశమైనా.. ఓ పార్టీకి ఏకపక్షంగా మద్దతు పలకడం కష్టం. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ కాపు నేతలు ఉన్నారు. వారికి ప్రాధాన్యం లభిస్తోంది. అందరూ బయటకు వచ్చి తమ సామాజికవర్గానికే మద్దతు ఇవ్వాలని అడగలేరు. కాపులు కూడా ఒకే కులం కాదు.. కాపు, తెలగ, ఒంటరి, బలిజ రకాలుగా ఉన్నాయి. అందులోనూ రాజకీయం చిచ్చు పెడుతుంది. అందుకే... కాపు నేతలు సమావేశాలు..తమ వర్గానికి మెరుగైన అవకాశాల పొందేలా చేయడం.. అవకాశం వచ్చినప్పుడు సీఎం పీఠాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలనే కోణంలోనే జరిగే అవకాశం ఉందనేది ఎక్కువ మంది చెప్పేమాట.