YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ కాదు..ఎమ్మెల్యేల గురి

ఎంపీ కాదు..ఎమ్మెల్యేల గురి

విశాఖపట్టణం, డిసెంబర్  16, 
ఉమ్మడి విశాఖజిల్లాలో ఒకప్పుడు ఎంపీలు చాలా పవర్ ఫుల్. సుదీర్ఘ అనుభవం, విస్త్రతమైన పరిచయాలతో ఓ వెలుగు వెలిగేవాళ్లు నాయకులు. సీనియారిటీ, సంప్రదాయంగా సీట్లు కేటాయించే విధానానికి తొలిసారి బ్రేకులు వేసింది వైసీపీ. 2019లో అనూహ్యంగా కొత్త ముఖాలను తెరపైకి తెచ్చి గెలిపించుకుంది. వైసీపీ నుంచి విశాఖ ఎంపీగా ప్రముఖ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ, ఎస్.టి. రిజర్వ్డ్ నియోజకవర్గం అరకు నుంచి గోడ్డేటి మాధవి.. అనకాపల్లి నుంచి డాక్టర్ సత్యవతమ్మ గెలిచారు. ఈ ముగ్గురు రాజకీయంగా నిలదొక్కుకునేందుకు మూడున్నరేళ్లుగా చేయని ప్రయత్నాలు లేవు.
మొదట్లో విశాఖ ఎంపీ ఎంవీవీకి అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ.. తర్వాత అంతర్గత సమీకరణాలు వేగంగా మారాయి. ముఖ్య నాయకుడితోనే ఆయన వైరం పెట్టుకున్నారు. ప్రస్తుతం తన వ్యాపార సంబంధమైన ప్రాజెక్టులపై తలెత్తిన విమర్శలను పరిష్కరించుకుని పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారు ఎంవీవీ. వచ్చే ఎన్నికల్లో ఆయన్ని అసెంబ్లీ బరిలోకి దించేందుకు వైసీపీ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే చర్చ బలంగా ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన వెలగపూడికి అడ్డుకట్ట వేయడానికి ఎంవీవీనే బలమైన అభ్యర్ధిగా హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు భోగట్టా. మొదట్లో ఎంపీ అంతగా సుముఖత వ్యక్తం చేయనప్పటికీ.. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రమోషన్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారట.ఇక టీచర్‌గా కెరీర్ ప్రారంభించి అనూహ్యంగా ఎంపీ అయ్యారు గొడ్డేటి మాధవి. ఆమె తండ్రి దేవుడు చింతపల్లి మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ నీడ ఎప్పుడు ఆమె మీద పడలేదు. తొలి ప్రయత్నంలోనే కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ పై భారీ మెజారిటీతో మాధవి గెలిచారు. అరకు పార్లమెంట్ పరిధిలోనే పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాల్లో కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ గెలిచారు. మొదట్లో వీరంతా సఖ్యంగానే కనిపించినప్పటికీ తర్వాత రాజకీయం రంగు మారింది. ఆ ఎమ్మెల్యేలతో మాధవికి వర్గ విభేదాలు మొదలయ్యాయి. దీనివెనుక బలమైన కారణాల్లో ఒకటి.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటుపై మాధవి కన్నేయడమేనట. సొంత నియోజకవర్గమైన పాడేరు నుంచి పోటీకి ఆసక్తిని కనబరుస్తున్నారట మాధవి. ఆ దిశగా తన వర్గాన్ని యాక్టివేట్ చేసి పనిలో ఉన్నారట. దీంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అలర్ట్ అయ్యారు. ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టడంతో అసంతృప్తులు కాస్త చల్లబడ్డాయి. ఎమ్మెల్యే నుంచి ఎదురుదాడి పెరగడంతో మాధవి పునరాలోచనలో పడ్డారట. ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక నెరవేర్చుకోవడానికి అరకుపై ఫోకస్‌ పెట్టారట. ఇక్కడ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణది వాల్మీకి సామాజికవర్గం. కానీ.. అరకులో కొండదొర సామాజికవర్గం బలం ఎక్కువ. పైగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఆదివాసీ హక్కుల పరిరక్షణకు మాధవి తండ్రి దేవుడు పనిచేశారు. వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాల మద్దతు కూడగట్ట గలిగితే తన గెలుపు ఈజీ అవుతుందనే అంచనాల్లో మాధవి ఉన్నారట. ఎంపీ వ్యూహాలను పసిగట్టిన ఎమ్మెల్యే ఫాల్గుణ.. విరుగుడు మంత్రాలు వేస్తున్నారట.మరో నియోజకవర్గం అనకాపల్లి. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ భీశెట్టి సత్యవతి అనూహ్యంగా వైసీపీలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా వెళ్లాలని ఆశపడ్డా.. పార్టీ నిర్ణయం మేరకు ఎంపీగా గెలిచారు. మంత్రి అమర్నాధ్‌, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వర్గాలకు దీటుగా రాజకీయం చేయాలని చూశారు. ఆ తర్వాత కాలంలో మంత్రి, ఎంపీ సయోధ్యకు వచ్చినట్టు కనిపించినా.. దాడి వెర్సస్ ఎంపీ కుంపటి రాజుకుంటూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి కాకుండా యలమంచిలి నుంచి పోటీ చేయాలని అమర్నాథ్‌ చూస్తున్నారట. దాంతో అనకాపల్లి అసెంబ్లీ సీటుపై ఎంపీ సత్యవతి నజర్‌ పడినట్టు సమాచారం. గవర సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే డిమాండ్‌కు అనుగుణంగా అనకాపల్లి సీటు కోసం గట్టిగా ప్రయత్నించాలని సత్యవతమ్మ భావిస్తున్నారట. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ఈక్వేషన్ ఆధారంగా.. అవసరమైతే మంత్రి అమర్నాథ్‌ సహకారం కోరాలనేది ఎంపీ ఆలోచనగా ఉందట. మొత్తానికి ముగ్గురు ఎంపీలు శాసనసభ గడప తొక్కాలని ఆరాటపడడం పార్టీలో చర్చగా మారింది. మరి.. వీరిలో ఎవరికి హైకమాండ్‌ ఛాన్స్‌ ఇస్తుందో ఏమో..!

Related Posts