న్యూఢిల్లీ, డిసెంబర్ 16,
రఫేల్ యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్‌క్రాఫ్ట్ భారత్‌లో ల్యాండ్ అయింది. యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్‌లో ఇంధనం నింపుకున్న తర్వాత ఈ విమానం భారత్ కు చేరుకుందని వాయుసేన ప్రకటించింది.ఈ 36 రఫేల్ యుద్ధ విమానాల్లో 18 విమానాలను హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతానికి ఉత్తరంగా ఉన్న అంబాలా ఎయిర్ బేస్ లో మోహరించారు. మిగితా వాటిని ఉత్తర బంగాల్‌లోని హసిమరా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో మోహరించనున్నారు. భారత వైమానిక దళ సామర్థ్యం పెంచుకోవడానికి భారత్ తన మిత్ర దేశం అయిన ఫ్రాన్సుతో 36 విమానాలను రూ.59,000 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. వీటిలో మొదటి బ్యాచ్‌లో భాగంగా 5 రఫేల్ జెట్ యుద్ధ విమానాలు 2020 జూలై 29 న భారత్‌కు చేరుకున్నాయి. అదే సంవత్సరం నవంబర్ 3వ తేదీన రెండవ బ్యాచ్‌లో మరో మూడు రఫేల్ జెట్లు చేరుకున్నాయి.2021 జనవరి నెలలో మూడో బ్యాచ్‌లో మరో మూడు జెట్లు భారత్ కు వచ్చాయి. రష్యా నుంచి సుఖోయి ఫైటర్ జెట్ల తర్వాత భారత్ కొనుగోలు చేసిన ముఖ్యమైన యుద్ధ విమానాలు ఈ రఫేల్ జెట్లు. వీటిని ఫ్రెంచ్ ఏరోస్పేస్ మేజర్ దస్సుల్ట్ ఏవియేషన్ అనే సంస్థ తయారు చేస్తుంది.ఫ్రాన్స్ తయారు చేస్తున్న ఈ రఫేల్ ఫైటర్ జెట్లు అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను మోసుకెళ్ళే సామర్థ్యం కలిగి ఉన్నాయి. రఫేల్ జెట్ లో యురోప్ కు చెందిన క్షిపణి తయారి సంస్థ ఎంబీడీఏ కు చెందినా ఎయిర్- టూ-ఎయిర్ క్షిపణి వ్యవస్థ, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణి, ఎంఐసిఏ ఆయుధ వ్యవస్థ చాలా ముఖ్యమైన ఆయుధ వ్యవస్థలు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త తరపు మీడియం రేంజ్ మాడ్యులర్ ఎయిర్-టూ-గ్రౌండ్ ఆయుధ వ్యవస్థ హామ్మర్ ను రఫేల్ తో అనుసంధానం చెయ్యడానికి సేకరించారు. హామ్మర్ (హైలీ అగిళ్ మోడులర్ మునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ) ఫ్రాన్స్ రక్షణ శాఖా మేజర్ సాఫ్రన్ రూపొందించిన అత్యంత కచ్చితత్వంతో పనిచేసే క్షిపణి. దీనిని ఫ్రెంచ్ వైమానిక దళం, నావికా దళం కోసం ప్రత్యేకంగా తయారు చేసారు. గగన తలంలో యుద్ధంలో మార్పు తీసుకురావడానికి రూపొందించిన క్షిపణి మేటోర్.చైనాతో తాజాగా సరిహద్దు ఘర్షణ తర్వాత చివరి రఫేల్.. భారత్‌కు చేరడం పట్ల నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చివరి జెట్‌తో రఫేల్ యుద్ధ విమానాలన్నీ భారత్‌కు చేరినట్లయ్యాయి. ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను చూసి చైనా కూడా ఒకింత జంకే అవకాశం ఉన్నట్లు వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రఫేల్ చేరికతో వాయుసేన మరింత బలోపేతమైంది.