YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భారీగా పడిపోయిన ఉల్లిపాయలు

భారీగా పడిపోయిన ఉల్లిపాయలు

పండితే పటేల్... పండక పోతే పాలేరు. ఇది రైతన్న పరిస్థితి. ఒక్కోసారి కాలం కలిసొచ్చి టన్నుల కొద్దీ పండినా... మార్కెట్ సహకరించకపోతే... చేసిన కష్టమంతా వృథానే! ఉద్యాన రైతుల విషయంలో... ఇదే నిజమేనన్న సంగతి రుజువైన సీజన్లెన్నో! స్థానికంగా ఉత్పత్తి పడిపోయి, దిగుమతులు తగ్గినప్పుడు.... ఉల్లిగడ్డ కొండెక్కి కూర్చొంటుంది. ఉత్పాదకత భారీగా పెరిగినప్పుడు... హీనపక్షంగా దిగొచ్చి రైతుకు కన్నీళ్లు పెట్టిస్తొంది ఈ ఎర్రగడ్డ. మాటలే పెట్టుబడిగా పెట్టే దళారీ మాత్రం క్వింటాకు నాలుగైదు వందల లాభాన్ని ఆర్జించడం గమనార్హం.  ఏటా ఏదొక సీజనులో ఉల్లి రైతులు నష్టాలతో... కన్నీరు పెడుతూనే ఉన్నారు. ధర పెరిగినపుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే ఉల్లి... రేటు లేనప్పుడు మాత్రం పండించిన మట్టిమనిషిని ఏ ప్రభుత్వమూ పట్టించుకోని దైన్యం.  పంట ఉత్పాదకత భారీగా హెచ్చినపుడు వెల వాల్చే ఉల్లిగడ్డ విపణి.... రైతుల ఇళ్లు ఖాళీ అయిన వెంటనే ఎర్రగడ్డ ధర తలలు ఎగరేయడం పరిపాటిగా మారింది. ఈ పరిమాణంతో అటు రైతులు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు. ఏ కష్టమూ చేయని బ్రోకర్లు, కమీషన్ ఏజెంట్లు, టోకు వర్తకులు మాత్రం... ప్రతి క్వింటాపై వందల లాభాలను కళ్లజూస్తోన్నారని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఒకానొక దశలో ఉల్లి రేటు కేజీ 100 రూపాయల దరిదాపులకు చేరడం... లేదంటే ఒకట్రెండు రూపాయలకు పడిపోవడం ఉల్లికే చెల్లింది. ప్రస్తుతం మార్కెట్ తిరోగమనంలో నడుస్తుండటం వల్ల.... ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుకు కేజీకి ఐదారు రూపాయలు దక్కని దుస్థితి. వినియోగదారు మాత్రం కేజీకి 12 నుంచి 15 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. సూపర్ మార్కెట్లలోనైతే మరో ఐదు రూపాయలు అదనం. ఉల్లి పంట రాని సమయంలో చిల్లర మార్కెట్‌లో కేజీ ఉల్లి గడ్డ దాదాపు 40 నుంచి 50 రూపాయల వరకు అమ్మింది. పంట రాగానే కిలో రేటు 10 రూపాయలకి దిగొచ్చింది. మొత్తంగా తమ కష్టం దళారుల పాలవుతోందని కర్నూలు ఉల్లి రైతులు కుమిలిపోతున్నారు. ఉద్యాన పంటైన ఉల్లిని ఏటా మూడు పంటలు తీయవచ్చు. ఎకరా సాగు వ్యయం... 35 నుంచి 40 వేల రూపాయలు ఖర్చవుతోంది. ఈ సీజనులో నీటిఎద్దడిని అధిగమించి...మరీ కర్నూలు రైతులు నాణ్యమైన పంటను తీశారు. ఎకరాకు గరిష్టంగా 10 నుంచి 14 టన్నుల దిగుబడులను సాధించారు. ఇప్పుడు నాణ్యమైన క్వింటా ఉల్లిపాయను నాలుగైదు వందలకు వ్యాపారులు అడగడాన్ని ఉత్పత్తిదారులు నిరసిస్తున్నారు. ఈ రేట్లకు ....తమ శ్రమ వృథా సహా పెట్టుబడులు కూడా గిట్టడం లేదని ఉల్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.  అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ఏ కష్టమూ చేయని దళారులు మాత్రం క్వింటాకు హీనపక్షంగా నాలుగైదు వందలు గడిస్తున్నారు. ఆరుగాలం శ్రమించే కష్టజీవికి మాత్రం కష్టం మందమైనా దక్కకపోగా... అసలులే ఎసరొచ్చే దుస్తితి. ఈ ఒడుదొడుకులను సరిదిద్దాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు.... జాతీయమార్కెట్, పెరిగిన ఉల్లి దిగుబడులే కారణమంటూ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు లాభసాటి ధరలు రావాలంటే... ఉల్లి గడ్డ నిల్వకు మౌలికవసతులు కల్పించాలి. లేదా ధరల స్థిరీకరణ నిధిని మాటలకే పరిమితం చేయకుండా... క్వింటా ఉల్లిని 1500 రూపాయల చొప్పున... మార్కెటింగ్ శాఖే కొనుగోలు చేయాలి. లేదా రవాణా, టోల్ ట్యాక్సుల విషయంలో రైతులకు మినహాయింపునిచ్చి.... లాభసాటి ధరలు వచ్చేచోట అమ్ముకునే వీలు కల్పించాలని ఉత్పత్తిదారులు, రైతు సంఘాలు...ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేస్తున్నాయి. 

Related Posts