సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ)పై తెలుగు రాష్ట్రాల మహిళా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు కన్నెర్రజేసిన విషయం తెలిసిందే. అంతేకాదు కేసులు, కోర్టుల దాకా కూడా వ్యవహారాలు వెళ్లాయి. అయితే ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో వర్మ తనను కించపరిచేలా మాట్లాడారని గురువారం నాడు సామాజిక కార్యకర్త, మహిళసంఘం నాయకురాలు పోలీసులను ఆశ్రయించారు. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయన తెరకెక్కించిన జీఎస్టీ లఘుచిత్రాన్ని విడుదల కాకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వర్మపై ఐపీసీ 508, 509, ఐటీ యాక్ట్ 67, 57 కింద కేసు నమోదు చేశారు. రెండు మూడు రోజుల్లో వర్మకు సీసీఎస్ పోలీసులు నోటీసులు అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలాంటి విషయాల్లో ఆర్జీవీ చాలా తెలివిగా ప్రదర్శిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పటికే ముందు జాగ్రత్తగా న్యాయ సలహా తీసుకున్నాడని తెలుస్తోంది. నోటీసులు అందిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విచారణకు హాజరయ్యి వివరణ ఇచ్చుకోవాలని వర్మ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి చూస్తే గత కొద్దిరోజులుగా టీవీ చానెల్స్ వేదికగా దేవీ-ఆర్జీవీ మధ్య జరిగిన మాటల యుద్ధం వర్మను విచారణకు హాజరయ్యేలా చేసిందన్న మాట. అందుకే ఆడవారితో కాస్త ఆచితూచి మాట్లాడాలని పెద్దలు చెబుతుంటారన్న విషయాన్ని వర్మ తెలుసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే దేవీ ఎఫెక్ట్‌తో పోలీసు మెట్లెక్కనున్న ఎలా వివరణ ఇచ్చుకుంటాడో వేచి చూడాల్సిందే మరి. అయితే దేవీ కేసు వ్యవహారంపై ఇంత వరకూ వర్మ ఎక్కడ స్పందిచలేదు. శుక్రవారం విడుదలయ్యే జీఎస్టీ లఘుచిత్రం తర్వాత తనపై విమర్శలు, కేసులు పెట్టిన వారిని ఉద్దేశించి ఇవాళ సాయంత్రం లోపు ఆయన స్పందించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.