కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నాడు జేడీఎస్ నేత కుమారస్వామి. మరోవైపు డిప్యూటీ సీఎం పదవులు, మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమిలో తర్జనభర్జనలు సాగుతూ ఉన్నాయి. ఎవరికి ఎన్ని పదవులు? ఆ పదవులు ఎవరికి ఇవ్వాలి? అనే అంశంపై చర్చలు సాగుతూ ఉన్నాయి. అసలే స్వల్ప మెజారిటీ మాత్రమే ఉన్న ఈ కూటమిలో ఈ పదవుల పందేరం ఎక్కడ కలహాలకు దారి తీస్తుందో అనే సందేహాలు కూడా నెలకొని ఉన్నాయి. ఇలాంటి రాజకీయ రసవత్తర పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ సమయంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక పగ్గాలను పూర్తిగా తన తనయుడు కుమారస్వామికే అప్పగించేయాలని దేవేగౌడ అంటున్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనకు డిప్యూటీ సీఎంలు అవసరం లేదని దేవేగౌడ అభిప్రాయపడ్డారు. తమది రాజకీయ అవకాశవాదం కాదని ఈయన అంటున్నారు. బీజేపీని నిరోధించడానికి మాత్రమే తాము చేతులు కలిపామని దేవేగౌడ వ్యాఖ్యానించారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. తన తనయుడు మాత్రమే పీఠంపై ఉండాలి, డిప్యూటీ సీఎంలు అసలు వద్దు అని దేవేగౌడ అంటుండటం మాత్రం ఆసక్తిదాయకంగా మారింది. కాంగ్రెస్ వాళ్లు డిప్యూటీ సీఎం పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం సీటు కుమారస్వామికి వెళ్లినా, రెండు డిప్యూటీ సీఎం పదవులు తమకు దక్కుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వాటి కోసం ఆ పార్టీలో పోటీ నెలకొని ఉంది. ఈ తరుణంలో దేవేగౌడ అసలు డిప్యూటీలే వద్దు అనడం రాజకీయాన్ని మరింత ఆసక్తిదాయకంగా మారుస్తోంది.