విశాఖపట్టణం, డిసెంబర్ 19,
చలికాలం ఒక్కో వారం ఒక్కో విధంగా ఉంటోంది. ఏపీలో పర్యాటకుల స్వర్గధామం అరకు రష్ గా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. తుఫాను ప్రభావం లేకపోవడంతో మళ్ళీ ఒక్క సారిగా పెరిగింది చలి తీవ్రత…అరకు ప్రాంతంలో వివిధ చోట్ల విరీతంగా కురుస్తుంది మంచు. దీంతో మాడగడ మేఘసంద్రం వ్యూ పాయింట్ కు పోటెత్తారు పర్యాటకులు.మాడగడ రహదారిలో బారులు తీరాయి వాహనాలు. మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. అరకులో ప్రతి ఏటా పది డిగ్రీలకు లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అరకులో గత నెల మూడవ వారంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. నవంబర్ 19న పది డిగ్రీలకు లోపే నమోదయ్యాయి. ఉదయం 10 గంటల వరకూ పొగమంచు కప్పేసుకుంది. చింతపల్లి, కేంద్ర పొగాకు బోర్డు ప్రాంతాలు చలికాలంలో చలితీవ్రతతో వణికిపోతుంటాయి.మరోవైపు ఏపీలో మిగతా ప్రాంతాల్లోనూ చలితీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్కాపురంను కప్పేసింది పొగ మంచు.. తొమ్మిది గంటలు దాటినా తగ్గలేదు పొగమంచు. ఎదుటి వ్యక్తి కనబడనంతగా దట్టంగా కురుస్తుంది మంచు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడక ఇక్కట్లు పడుతున్నారు వాహనదారులు. రోడ్డుపై జాగ్రత్తగా ప్రయాణాలు సాగించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆంధ్రా పల్లెల్లో మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిపోతోంది. ఆదివాసీ ప్రాంతాల్లో నీళ్ళు సైతం గడ్డకట్టిపోతున్నాయి. జనం బయటకు పోవాలంటేనే వణికిపోతున్నారు. చలితీవ్రత ఎక్కువగా వుండడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.