గుంటూరు, డిసెంబర్ 19,
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంటలు కలకలం రేపుతున్నాయి. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లకు గుర్తు నిప్పులు పెట్టిన ఘటన మరువక ముందే తెనాలిలో అన్న క్యాంటీన్ భవనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ‘మంట’ల రాజకీయం మాచర్ల నుంచి తెనాలికి షిఫ్ట్ అయినట్లైంది. శనివారం అర్థరాత్రి సమయంలో అన్న క్యాంటీన్ భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్న క్యాంటీన్ గత కొదంది కాలంగా నిరుపయోగంగా ఉంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది.మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ‘ఇదేం కర్మ’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో టీడీపీ-వైసీపీ మధ్య పొలిటికల్ వార్ మరింత రాజుకుంటోంది. ఓ వైపు ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా, కొన్ని భవనాలు, కొంతమంది నాయకుల ఇళ్లకు నిప్పులు పెట్టడం తీవ్ర దుమారానికి దారి తీస్తోంది.మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత..పల్నాడు జిల్లా మాచర్లలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల టీడీపీ ఇంచార్జ్ బ్రహ్మరెడ్డి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుబెట్టడంతో మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే.మాచర్లలో వైసీపీ -టీడీపీ మధ్య చెలరేగిన ఘర్షణల విధ్వంస సెగలు చల్లారలేదు. మాచర్ల పట్టణం నివురుగప్పిన నిప్పులా ఉంది. నాటి ఘటనలు మాచర్లను అట్టుడికించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన బాధితులు ఇంకా భయాందోళనల నుంచి తేరుకోనే లేదు. సాధారణ ప్రజలు సైతం ఎప్పుడేం జరుగుతుందో అని భయంతో వణికి పోతూనే ఉన్నారు. అయితే పోలీసులు మాచర్లలో భారీ బలగాలను మోహరించామని చెబుతూనే ఈ ఘటనలపై ఇప్పటి వరకు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదంటున్నారు.పల్నాడు ఘటనలో తెలుగుదేశం కార్యాలయంతో పాటు పార్టీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ నేతలు నిప్పు పెట్టడంతో టీడీపీ కార్యాలయం కాలిపోయింది. టీడీపీ నేతలకు చెందిన 10కి పైగా వాహనాలు ధ్వంసం కాగా, 2 వాహనాలను దగ్ధం చేశారు. తెనాలి పరిస్థితి సద్దుమణగక ముందే గుంటూరు జిల్లా తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం హయాంలో ఏర్పా టు చేసిన క్యాంటీన్ ను.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసివేసిన విషయం తెలిసిందే. ఈ క్యాంటీన్ కు అర్ధరాత్రి సమయంలో దుండగులు నిప్పు పెట్టారు.క్యాంటీన్ తలుపు వద్దే ఈ నిప్పు పెట్టగా.. మంటలు చెలరేగటం గమనించి స్థానికులు మంటలను అర్పి వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో సంఘటన స్థలానికి వచ్చి న టీడీపీ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టటం వెనుక ఉన్నది వైసీపీ హస్తమేనని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. విధ్వంసం, దహనకాండలతో వైసీపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు.