YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ వ్యూహాం అదేనా

పవన్ వ్యూహాం అదేనా

విజయవాడ, డిసెంబర్  20, 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రిని కావాలని బలంగా కోరిక ఉంది. అయితే ఎలా? జనసేనకు ఎన్ని స్థానాలు వస్తే ఆయన సీఎం అవుతారు? కనీసం యాభై స్థానాల్లో గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ మిత్రపక్షం ముందు ప్రతిపాదన పెట్టొచ్చు. కానీ ఆ స్థాయిలో గెలవాలంటే పవన్ కల్యాణ్ ఏం చేయాలి? ఇప్పటిలా వీకెండ్ కు వచ్చి నాలుగు డైలాగులు కొట్టిపోతే జనం నమ్ముతారా? నేతలకే నమ్మకం కలిగించలేదని పవన్ ప్రజలను ఎలా నమ్మించగలుగుతారు? ఈ ప్రశ్నలన్నీ జనసేన నాయకుల నుంచి వస్తున్నవే. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేయాలని కోరుతున్నారు. పైగా పవన్ చేస్తున్న కామెంట్స్ కార్యకర్తలకు కూడా అర్థం కాకుండా ఉన్నాయి. వ్యూహం తనకు వదిలేయాలని, పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. వినటానికి బాగానే ఉంది కానీ, కార్యాచరణలో సాధ్యమైనా? ఒకవైపు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకుండా చూస్తానంటున్నారు. తనను సీఎం చేయడానికి జనం బలంగా కోరుకోవాలని అంటున్నారు. ఈ రెండింటికి ఎలా కుదురుతుంది? అన్న ప్రశ్నకు జనసైనికుల వద్ద సమాధానం దొరకడం లేదు. అంటే తెలుగుదేశం పార్టీతో కలసి పనిచేస్తానని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. మరి టీడీపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే ఈయన ఎలా సీఎం అవుతారు? ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కాకుండా జనసేనకు సీఎం పదవి ఎందుకు ఇస్తుంది? టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే అత్యధికస్థానాల్లో టీడీపీయే పోటీ చేస్తుంది. ఇప్పుడున్న బలాల ప్రకారం టీడీపీయే ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. తక్కువ స్థానాలు గెలిచిన పవన్ ను పిలిచి మరీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేంత దయార్ద్ర హృదయం ఎవరిక ఉంటుంది? అందునా చంద్రబాబు లాంటి నేతలు పవన్ కు ఉదారంగా సీఎం సీటు ఇచ్చేసి తాను తప్పుకుంటారా? అంటే అంతకంటే వెర్రితనం మరొకటి ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుంది. విడిగా పోటీ చేసి ఎవరికీ తగినంత మెజారిటీ రాకపోతే.. జనసేన కొన్ని స్థానాలు గెలిచి దాని మద్దతు అవసరమైతేనే అది సాధ్యమవుతుంది. కానీ ఏపీలో ఆ సీన్ ప్రస్తుతానికయితే లేదు. కర్ణాటకలో జేడీఎస్ మాదిరి అధికారంలోకి రావాలంటే తనంతట తానుగా విడిగా పోటీ చేయాలి. అంతేకాని పొత్తులు ముందే పెట్టుకుని పోటీ చేస్తే సీఎం పదవి పిలిచి ఇచ్చేంత సహృదయం రాజకీయాల్లో అసలు ఉండదు. మరి ముందుగానే పవన్ కల్యాణ్ టీడీపీతో ముఖ్యమంత్రి తనకే ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంటారా? లేక ఎక్కువ స్థానాల్లో గెలిచిన అనంతరం తనకు సీఎం పదవి ఇవ్వాలని పట్టుబడతారా? అన్నది తెలియాల్సి ఉంది. బహుశ అదే ఆయన వ్యూహమేమో? చూడాలి.

Related Posts